ఓ సీనియర్ నటుడి వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా బాధించాయి: అనసూయ

18-10-2021 Mon 19:26
  • తన వేషధారణపై వ్యాఖ్యలు చేశారన్న అనసూయ
  • మరీ ఇంత దిగజారుడుతనమా అంటూ ఆగ్రహం 
  • పనికిరాని చెత్తను ప్రచారం చేస్తున్నారని వెల్లడి
  • ఎవరి పని వారు చూసుకోవాలని హితవు
Anasuya responds to senior actor comments on her dressing
టాలీవుడ్ నటి అనసూయ సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. తన దుస్తులు, వేషధారణపై ఓ సీనియర్ నటుడి వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని తెలిపారు. ఎంతో అనుభవం ఉన్న ఆ నటుడు మరీ ఇంత అల్పస్థాయిలో వ్యాఖ్యానించడం విచారకరమని పేర్కొన్నారు. ఎలాంటి దుస్తులు ధరించాలన్నది వ్యక్తిగత విషయం అని, ఒక్కోసారి వృత్తిపరంగానూ విభిన్న ఆహార్యంలో కనిపించాల్సి ఉంటుందని అనసూయ వివరించారు.

కానీ నేటికీ సోషల్ మీడియాలో వేరొకరి వేషధారణ, దుస్తులపై పనికిరాని చెత్తను ప్రముఖంగా ప్రచారం చేస్తుండడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. అప్పట్లో సోషల్ మీడియా ఉండుంటే.. సినిమాల్లో ఈ నటుడు వేసిన తాగుబోతు వేషాలను, ధరించిన చింపిరి దుస్తులను, మహిళలను అవమానించడాన్ని ప్రశ్నించి ఉండేదా? అని నిలదీశారు.

"పెళ్లయి, పిల్లలు కూడా ఉండి, వెండితెరపై చొక్కా లేకుండా బాడీ చూపిస్తూ హీరోయిన్లతో రొమాన్స్ చేసే స్టార్లను ఎందుకు ప్రశ్నించరు? నాలాగా పెళ్లయి, ఇద్దరు బిడ్డల తల్లి అయి ఉండి ఇప్పటికీ చిత్ర పరిశ్రమలో పనిచేస్తూ, వృత్తిపరంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న వారు, అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించేవారు మీకు నచ్చడం లేదా? అలాగైతే మీ పని మీరు చేసుకోండి... ఇతరులపై అభిప్రాయాలు వెల్లడించడం మానుకోండి" అంటూ అనసూయ వ్యాఖ్యానించారు.

టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఇటీవల ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయపై వ్యాఖ్యలు చేశారు. అనసూయ మంచి నటి అని, అందంగానే ఉంటుందని అన్నారు. అయితే అనసూయ డ్రెస్సింగ్ తనకు నచ్చదని పేర్కొన్నారు. అందంగా ఉండే అనసూయ అలాంటి దుస్తులు వేసుకోవాల్సిన అవసరం లేదని కోట అభిప్రాయపడ్డారు. కోట వ్యాఖ్యలపైనే అనసూయ పైవిధంగా స్పందించినట్టు అర్థమవుతోంది.