హుజూరాబాద్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ: మాణికం ఠాగూర్

18-10-2021 Mon 18:44
  • హుజూరాబాద్ లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారు
  • ఎన్నికల సంఘం స్వతంత్రతను కోల్పోయింది
  • హుజూరాబాద్ లో ఇంటికొక నిరుద్యోగి ఉన్నాడు
Huzurabad fight is in between Congress and BJP says Manickam Tagore
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని, మద్యం ఏరులై పారుతోందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్ ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈసీ తనకున్న స్వతంత్రతను కోల్పోయిందని దుయ్యబట్టారు.

అధికారంలోకి వస్తే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన టీఆర్ఎస్... ఆ హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇంటికొక నిరుద్యోగి ఉన్నాడని చెప్పారు. ఉపఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని అన్నారు. ఈ నెల 30న హూజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.