ఈ నెల 30 తర్వాత ప్రతీకారం తీర్చుకుంటాం: ఈటల రాజేందర్

18-10-2021 Mon 15:29
  • హుజూరాబాద్ లో నా గెలుపు ఖాయం
  • నాపై ఎన్నో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
  • హుజూరాబాద్ కు పథకాలు రావడానికి నేనే కారణం
Will take revenge after this month 30 says Etela Rajender
హుజూరాబాద్ ఉపఎన్నికలో తాను విజయం సాధించడం ఖాయమని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎగిరేది బీజేపీ జెండానే అని అన్నారు.

ప్రత్యర్థులు తనపై ఎన్నో ఆరోపణలు చేస్తున్నారని... తాము కళ్లు తెరిస్తే తప్పుడు ఆరోపణలు చేస్తున్నవారంతా మాడి మసైపోతారని చెప్పారు. పోలింగ్ సమయం దగ్గర పడుతోందని... అందుకే తాను ఏమీ మాట్లాడటం లేదని అన్నారు. ఈ నెల 30న పోలింగ్ ముగిసిన తర్వాత ఎవరెవరు ఏమేం మాట్లాడారో... దానికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పారు.

హుజూరాబాద్ కు ఇప్పుడు దళితబంధు, పెన్షన్లు సహా ఎన్నో రావడానికి తానే కారణమని ఈటల అన్నారు. ఆనాడు తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ... ఇచ్చిన పార్టీని కాదని రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ టీఆర్ఎస్ కు ప్రజలు ఓటు వేశారని చెప్పారు. ఇప్పుడు కూడా పథకాలు ఇస్తున్న కేసీఆర్ కు కాకుండా... ఆ పథకాలు రావడానికి కారణమైన తనకు ఓట్లు వేస్తారని అన్నారు. ఉపఎన్నికలో బీజేపీని భారీ మెజర్టీతో గెలిపించాలని కోరారు.