జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పులు... ఇద్దరు వలస కూలీల మృతి

17-10-2021 Sun 21:13
  • కశ్మీర్లో మరోసారి కాల్పులు
  • కుల్గాం జిల్లా వాంపో ప్రాంతంలో ఘటన
  • వలస కూలీల క్యాంపుపై కాల్పులు
  • ఇద్దరు బీహార్ వలస కూలీల మృతి
  • మరో కూలీకి గాయాలు
Terrorists killed two Bihar migrant workers in Jammu Kashmir
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. నేడు కుల్గాం జిల్లా వాంపో ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వలస కూలీల క్యాంపుపై జరిపిన ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించారు. వారిరువురు బీహార్ కు చెందిన వలస కూలీలు. మరో వలస కూలీకి గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు.

నిన్న పానీ పూరీ అమ్మే ఓ బీహారీని, యూపీకి చెందిన ఓ కార్పెంటర్ ను టెర్రరిస్టులు పొట్టనబెట్టుకోగా, ఇవాళ కూడా ఉగ్ర తుపాకీ పేలింది.

కాగా, మాజీ ముఖ్యమంత్రి ఫారూఖ్ అబ్దుల్లా స్పందిస్తూ, కాల్పులకు పాల్పడిన వారు కశ్మీరీలు కాదని వ్యాఖ్యానించారు. ప్రశాంతంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతంలో కల్లోలం సృష్టించేందుకు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కశ్మీరీలను అప్రదిష్ఠపాల్జేసేందుకు ఓ పథకం ప్రకారం ఈ ఘటనలకు తెగబడుతున్నారని అబ్దుల్లా ఆరోపించారు.