పెట్రోల్ పన్నుల తగ్గింపుపై కర్ణాటక సీఎం కీలక ప్రకటన

17-10-2021 Sun 13:05
  • ఉప ఎన్నికల అనంతరం నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
  • రాష్ట్ర ఆర్థిక స్థితిపై సమీక్ష చేస్తామని కామెంట్
  • ఆర్థిక స్థితి బాగుంటే పన్నులు తగ్గించేందుకు వీలు
Karnataka CM Says Petrol Tax Reduction Depends On Economic State
పెట్రోల్ ధరల తగ్గింపుపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కీలక ప్రకటన చేశారు. పన్నులు తగ్గించేందుకు ప్రయత్నిస్తామని, అయితే, అది రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపైనే ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. పెట్రోల్ ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈనెల 30న జరిగే ఉప ఎన్నికల తర్వాత ధరల తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

ఎన్నికలయ్యాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్ష చేస్తానని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంటే పన్నులను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ కూడా బొమ్మై దగ్గరే ఉంది. పెట్రోల్ రేట్లు దిగివచ్చేలా పన్నులను తగ్గిస్తామని ఈనెల 10న కూడా బొమ్మై చెప్పారు.