ద‌శ‌ర‌థుడి పాత్రలో న‌టిస్తూ కుప్ప‌కూలి చ‌నిపోయిన వ్య‌క్తి.. నాట‌కంలో భాగంగా ప‌డిపోయాడ‌నుకుని ప్రేక్ష‌కులు చ‌ప్ప‌ట్లు.. వీడియో వైర‌ల్

17-10-2021 Sun 11:50
  • ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘ‌ట‌న‌
  • ద‌స‌రా వేళ రామాయ‌ణ నాట‌కం
  • రాముడిని అడ‌వికి వెళ్లాల‌ని చెప్పే స‌న్నివేశం
  • అందులో న‌టించి కుప్ప‌కూలిన వ్య‌క్తి
dashrath dies on stage audience claps for great act
'జీవిత‌మే ఓ నాట‌క రంగం' అని అంటారు. నాటకాల్లో మనం చూసే ఎన్నో ఊహించ‌ని ప‌రిణామాల కంటే నిజ జీవితంలో మ‌నం చూసే ఊహించ‌ని మ‌లుపులే ఎక్కువ‌గా ఉంటాయి. అయితే, మ‌నం చూస్తున్న‌ది నాట‌కంలోని సీనా? లేక నిజ జీవితంలో చోటు చేసుకున్న ఊహించ‌ని ప‌రిణామమా? అన్న విష‌యాన్ని కూడా గుర్తించ‌లేనంత సంఘ‌ట‌న ఒక‌టి చోటుచేసుకుంది.

ద‌స‌రా సంద‌ర్భంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బిజ్నోర్ లో రామాయ‌ణ స‌న్నివేశాలను చూపెడుతూ నాట‌కం వేస్తున్నారు. ఈ నాట‌కంలో రాజేంద్ర క‌శ్య‌ప్ (62) అనే వ్య‌క్తి ద‌శ‌ర‌థుడి పాత్ర‌లో న‌టించాడు. రాముడిని 14 ఏళ్ల పాటు వ‌న‌వాసానికి వెళ్లాల‌ని చెప్పే ఘ‌ట్టంలో న‌టిస్తున్నాడు.

అనంత‌రం అత‌డు వేదిక‌పై ప‌డిపోవాల్సి ఉంటుంది. రాముడిని 14 ఏళ్ల పాటు వ‌న‌వాసానికి వెళ్లాల‌ని చెప్పిన వెంట‌నే ఆయ‌న ప‌డిపోయాడు. నాట‌కంలో భాగంగా ప‌డిపోవాల్సి ఉన్నా నిజానికి ఆయ‌న ఈ సారి ప‌డిపోయింది మాత్రం నాట‌కంలో భాగంగా కాదు. అస్వ‌స్థ‌తతో కుప్ప‌కూలిపోయాడు. ఆ విష‌యం ప్రేక్ష‌కులు గుర్తించ‌లేక‌పోయారు.

నాట‌కంలో భాగంగానే ఆయ‌న ప‌డిపోయాడ‌ని భావించి, అద్భుతంగా న‌టించాడంటూ చ‌ప్ప‌ట్లు కొట్టారు. నాట‌కం ముగిశాక కూడా ఆయ‌న లేవ‌క‌పోవ‌డంతో ఆయ‌న‌ను లేపే ప్ర‌య‌త్నం చేశారు. రాజేంద్ర క‌శ్య‌ప్ ఎంత‌కీ లేవ‌లేదు. ఆయ‌న నిజంగానే మృతి చెందాడ‌ని అంద‌రికీ అప్పుడు తెలిసింది.

ఆయ‌న నాటకంలో భాగంగానే ప‌డిపోయాడ‌ని అనుకున్నామ‌ని, ప్రేక్ష‌కులంతా చ‌ప్ప‌ట్లు కొట్టార‌ని రామ్ లీలా క‌మిటీ అధ్య‌క్షుడు సంజ‌య్ సింగ్ గాంధీ తెలిపారు. ఇది చాలా దుర‌దృష్ట‌క‌ర ఘ‌ట‌న అని అన్నారు. వేదిక‌పై నాట‌కం వేస్తోన్న స‌మ‌యంలో ఆయ‌న కార్డియాక్ అరెస్ట్ కార‌ణంగా కుప్ప‌కూలిపోయాడ‌ని వివ‌రించారు.

రాజేంద్ర క‌శ్య‌ప్‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ప్ప‌టికీ లాభం లేకుండాపోయింది. ఆయ‌న మృతి చెందాడ‌ని వైద్యులు ధ్రువీక‌రించారు. క‌శ్య‌ప్ రెండు ద‌శాబ్దాలుగా రామాయ‌ణ నాట‌కాల్లో పాత్ర‌లు వేస్తూ ప్రేక్ష‌కులను అల‌రిస్తున్నాడు. ఆయ‌న‌కు భార్య‌, ముగ్గురు కుమారులు, ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు.