Virat Kohli: టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రావిడ్... కోహ్లీ స్పందన

  • ద్రావిడ్ కు బాధ్యతలు అప్పగించేందుకు బీసీసీఐ ఆసక్తి
  • తననెవరూ సంప్రదించలేదన్న కోహ్లీ
  • ఏం జరుగుతోందో తనకు తెలియదని వెల్లడి
  • ప్రస్తుతం ఎన్సీఏ హెడ్ కోచ్ గా ఉన్న ద్రావిడ్
Kohli responds on Rahul Dravid as Teamindia head coach

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రావిడ్ నియామకం అంటూ మీడియాలో వస్తున్న వార్తలపై కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. అసలేం జరుగుతోందో తనకు అర్ధంకావడంలేదని వ్యాఖ్యానించాడు. కోచ్ విషయమై ఇంతవరకు ఎవరితోనూ చర్చించలేదని స్పష్టం చేశాడు. రేపటి నుంచి టీ20 వరల్డ్ కప్ జరగనుండగా, మీడియా సమావేశంలో పాల్గొన్న కోహ్లీని ఓ మీడియా ప్రతినిధి కొత్త కోచ్ అంశంపై ప్రశ్నించాడు. అందుకు కోహ్లీ బదులిస్తూ పైవిధంగా వ్యాఖ్యానించాడు.

సాధారణంగా కోచ్ నియామకంలో జట్టు కెప్టెన్ అభిప్రాయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటారు. 48 ఏళ్ల ద్రావిడ్ టీమిండియా-ఏ, భారత్ అండర్-19 జట్ల కోచ్ గా విశేషమైన ఫలితాలు అందించాడు. ప్రతిభావంతులుగా పేరుతెచ్చుకున్న రిషబ్ పంత్, శుభ్ మాన్ గిల్, పృథ్వీ షా, హనుమ విహారి, ఆవేశ్ ఖాన్... ద్రావిడ్ శిష్యరికంలో రాటుదేలినవాళ్లే.

ప్రస్తుతం రాహుల్ ద్రావిడ్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో చీఫ్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు. అయితే, ఐపీఎల్ కోసం దుబాయ్ వచ్చిన ద్రావిడ్ తో... బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా బీసీసీఐ కోచ్ బాధ్యతలపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది.

More Telugu News