T20 World Cup: రేపటి నుంచి టీ20 వరల్డ్ కప్... టీమిండియా గ్రూపులో ఏ జట్లు ఉన్నాయంటే..!

ICC World Cup event set start tomorrow
  • అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు మెగా టోర్నీ
  • మొత్తం 16 జట్లతో ఐసీసీ ఈవెంట్
  • యూఏఈ వేదికగా వరల్డ్ కప్
  • పాకిస్థాన్ పాటు ఒకే గ్రూపులో ఉన్న భారత్

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు రోమాంఛక వినోదాన్ని అందించిన ఐపీఎల్ 14వ సీజన్ ముగియగా, అదే స్థాయిలో క్రికెట్ మజాను అందించే టీ20 వరల్డ్ కప్ రేపటి నుంచి షురూ కానుంది. యూఏఈ వేదికగా అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు జరగనుంది. రేపు ఆరంభ మ్యాచ్ లో ఒమన్, పాపువా న్యూగినియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. రాత్రి 7.30 గంటల నుంచి జరిగే మరో మ్యాచ్ లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్ జట్లు పోటీపడతాయి.

ఈ టోర్నీ ఫార్మాట్ చూస్తే... మొత్తం 16 జట్లతో టోర్నీ నిర్వహిస్తున్నారు. తొలుత 8 చిన్న జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో శ్రీలంక, నెదర్లాండ్స్, ఐర్లాండ్, నమీబియా... గ్రూప్-బిలో బంగ్లాదేశ్, ఒమన్, స్కాట్కాండ్, పాపువా న్యూ గినియా జట్లు ఉన్నాయి. ఈ దశ అనంతరం సూపర్-12 దశ ఉంటుంది.

గ్రూప్-ఏ, గ్రూప్-బి నుంచి మెరుగైన ఫలితాలు సాధించిన 4 జట్లు ఈ సూపర్-12 దశకు అర్హత సాధిస్తాయి. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, వెస్టిండీస్ వంటి జట్లు నేరుగా సూపర్-12 దశ నుంచి ఈ టోర్నీలో తమ ప్రస్థానం ఆరంభిస్తాయి.

సూపర్-12 దశలో గ్రూప్-1లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు ఉండగా.... వాటితోపాటు గ్రూప్-ఏలో తొలిస్థానం సాధించిన జట్టు, గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టు కూడా పోటీపడతాయి.

గ్రూప్-2లో భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఉండగా... వాటితో పాటు గ్రూప్-బిలో ప్రథమస్థానం సాధించిన జట్టు, గ్రూప్-ఏలో ద్వితీయ స్థానం సాధించిన జట్టు తలపడతాయి.

సూపర్-12 దశలో మెరుగైన విజయాలు సాధించిన 4 జట్లు సెమీఫైనల్స్ లో అడుగుపెడతాయి. తొలి సెమీఫైనల్ నవంబరు 10న, రెండో సెమీఫైనల్ నవంబరు 11న జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ నవంబరు 14న జరగనుంది.

  • Loading...

More Telugu News