మరోసారి సెట్ అయిన 'స్వామిరారా' కాంబినేషన్!

16-10-2021 Sat 18:42
  • విడుదలకు రెడీగా '18 పేజెస్'
  • ముగింపు దశలో 'కార్తికేయ 2'
  • సుధీర్ బాబు నుంచి మరో సినిమా
  • వచ్చే ఏడాది సెట్స్ పైకి   
Nikhil in Sudheer Varma movie
నిఖిల్ ఎప్పటికప్పుడు తెరపై కొత్తగా కనిపించడానికి తపన పడుతుంటాడు. అందుకోసం విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఉంటాడు. ఆయన తాజా చిత్రంగా '18 పేజెస్' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఆ తరువాత సినిమాగా ఆయన 'కార్తికేయ 2' చేస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా, చిత్రీకరణపరంగా చివరిదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే నిఖిల్ మరో ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నాడు. గతంలో నిఖిల్ తో 'స్వామిరారా' .. 'కేశవ' సినిమాలను తెరకెక్కించిన సుధీర్ వర్మ, ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు.

ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే ఏడాదిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకావొచ్చునని అంటున్నారు. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.