'విద్యుత్ కోతలు' అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన ఏపీ ఇంధన శాఖ

16-10-2021 Sat 15:34
  • దసరా తర్వాత కోతలు అంటూ కథనాలు
  • స్పందించిన ఇంధన శాఖ
  • ఆ ప్రచారంలో వాస్తవంలేదని స్పష్టీకరణ
  • సీఎం జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించారని వెల్లడి
Fuel dept responds on social media propaganda
రాష్ట్రంలో విద్యుత్ కోతలు అంటూ సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని ఏపీ ఇంధన శాఖ పేర్కొంది. లోడ్ రిలీఫ్ పేరిట గ్రామాలు, పట్టణాల్లో కోతలు విధిస్తున్నారనడంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. దసరా పండుగ తర్వాత విద్యుత్ కోతలు తీవ్రం కానున్నాయంటూ ప్రచారం జరుగుతుండడంపై ఇంధన శాఖ స్పందించింది. బొగ్గు లభ్యత, నిల్వలు, సరఫరా తదితర అంశాలు విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయని, ఇది ఏ ఒక్క రాష్ట్రానికో కాకుండా, అంతర్జాతీయంగా ఇలాంటి పరిస్థితులే నెలకొని ఉన్నాయని ఇంధన శాఖ స్పష్టం చేసింది.

అయినప్పటికీ రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ అందజేసేందుకు డిస్కంలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని, దీనిపై సీఎం జగన్ కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని వివరించింది. సీఎం ఆదేశాలతో... ఏపీ జెన్ కో బొగ్గు కొనుగోలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయించినట్టు ఇంధన శాఖ వెల్లడించింది. దేశంలో ఎక్కడ్నించైనా బొగ్గు కొనుగోలు చేయాలని ఏపీ జెన్ కోకు ఆదేశాలు అందాయని పేర్కొంది.