'మా' ఎన్నికల్లో మేం గెలిచాం... ఆ విషయాన్ని ప్రత్యర్థి ప్యానెల్ వాళ్లు గౌరవించాలి: మంచు విష్ణు

16-10-2021 Sat 14:43
  • మా ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ విజయం
  • నేడు ప్రమాణ స్వీకారం
  • ప్రకాశ్ రాజ్ ప్యానెల్ రాజీనామా దురదృష్టకరమన్న విష్ణు
  • ఎన్నికల వ్యవహారం ఇంతటితో ముగిసిందని వెల్లడి
Manchu Vishnu taking oath as MAA President
'మా' నూతన అధ్యక్షుడిగా నటుడు మంచు విష్ణు నేడు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'మా' ఎన్నికల వ్యవహారం ఇక ముగిసిందని, తాను గానీ, తన ప్యానెల్ సభ్యులు గానీ ఎన్నికల వ్యవహారంపై ఇక మీడియా ముందు మాట్లాడబోమని స్పష్టం చేశారు.

 అయితే, హోరాహోరీగా జరిగిన 'మా' ఎన్నికల్లో తాము గెలిచిన విషయాన్ని ప్రత్యర్థి ప్యానెల్ సభ్యులు గుర్తించాలని అన్నారు. 'మా' అభివృద్ధి ప్రణాళికల్లో ప్రత్యర్థి ప్యానెల్ సహకారం కూడా తీసుకుంటామని తెలిపారు. ప్రత్యర్థి ప్యానెల్ రాజీనామా చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశం అమలు చేసేందుకు చిత్తశుద్ధితో శ్రమిస్తానని మంచు విష్ణు అన్నారు. ఎన్నికల సమయంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.