అవినీతి సొమ్ము నిల్వలో జగన్ రెడ్డి బిజీ.. బొగ్గు సంక్షోభంపై నారా లోకేశ్ మండిపాటు

  • రాష్ట్రాన్ని అంధకార ఆంధ్రప్రదేశ్ గా మార్చారని ఆగ్రహం
  • ఫ్యాన్ కు ఓటేస్తే ఇంట్లో ఫ్యాన్ ఆగిందంటూ వ్యంగ్యం
  • సొంత మీడియాకు రూ.200 కోట్లు దోచిపెట్టారని ఆరోపణ
Lokesh Fires On CM YS Jagan On Coal Crisis

బొగ్గు సంక్షోభం విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత నారా లోకేశ్ మండిపడ్డారు. రాష్ట్రాన్ని అంధకార ఆంధ్రప్రదేశ్ గా సీఎం జగన్ మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు నిల్వలను పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముందే హెచ్చరికలు జారీ చేసినా.. జగన్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. ఓ పక్క విద్యుత్ చార్జీల పెంపుతో బాదేస్తూ.. మరో పక్క కోతలతో అంధకారంలోకి నెట్టేశారని విమర్శించారు.

ఫ్యాన్ కు ఓటేస్తే ఇప్పుడు ఇంట్లోని ఫ్యాన్ ఆగిపోయిందని ఆరోపించారు. బొగ్గు కొరత వస్తోందని 40 రోజుల క్రితమే కేంద్రం హెచ్చరించినా.. తాడేపల్లి ప్యాలెస్ లో చలనం లేకుండా జగన్ నిద్రపోతున్నారని మండిపడ్డారు. సొంత మీడియా సంస్థలకు రూ.200 కోట్ల మేర ప్రకటనల రూపంలో దోచిపెట్టిన ప్రభుత్వం.. బొగ్గు సంస్థలకు రూ.215 కోట్ల బకాయిలను ఎందుకు చెల్లించలేదని నిలదీశారు. అవసరం మేర బొగ్గు నిల్వ చేసుకోవాలన్న కేంద్రం హెచ్చరికల్ని పెడచెవిన పెట్టి, కేవలం అవినీతి సొమ్మును నిల్వ చేసుకోవడంలోనే జగన్ రెడ్డి బిజీ అయ్యారని, అందుకే రాష్ట్రంలో ఈ పరిస్థితులొచ్చాయని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News