టిక్‌టాక్ లైవ్‌ చేస్తున్న మాజీ భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన మాజీ భర్త.. మరణశిక్ష విధించిన చైనా కోర్టు

16-10-2021 Sat 09:20
  • చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఘటన
  • అమచుకి టిక్‌టాక్‌లో 7.70 లక్షల మంది ఫాలోవర్లు
  • విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ పెళ్లి చేసుకుందామన్న టాంగ్
  • నిరాకరించడంతో హత్య
  • క్రూరమైన నేరానికి పాల్పడ్డాడన్న న్యాయస్థానం
Man who set on fire his ex wife during a livestream facing the death penalty
టిక్‌టాక్ లైవ్‌లో ఉన్న మాజీ భార్యపై కిరోసిన్ పోసి నిప్పు అంటించి హత్య చేసిన వ్యక్తికి చైనా కోర్టు మరణశిక్ష విధించింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. సిచువాన్ ప్రాంతానికి చెందిన టిబెటన్ వ్లాగర్ అయిన అమచు (30).. చైనా టిక్ టాక్ వెర్షన్ ‘డౌయిన్’లో లాము పేరుతో వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. డౌయిన్‌లో ఆమెకు 7.70 లక్షమంది ఫాలోవర్లు ఉన్నారు.

ఇద్దరు పిల్లలకు తల్లయిన అమచు.. 2009లో టాంగ్‌ను పెళ్లి చేసుకుంది. అయితే, ఆ తర్వాత కొన్ని రోజుల నుంచే వారి సంసారంలో కలతలు మొదలయ్యాయి. తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. దీంతో ఇక కలిసి ఉండడం సాధ్యం కాదని నిర్ణయించుకున్న ఇద్దరూ జూన్ 2020లో విడాకులు తీసుకున్నారు.

అయితే, ఆ తర్వాత కొన్ని నెలలకే మళ్లీ పెళ్లి చేసుకుందామంటూ అమచుపై టాంగ్ ఒత్తిడి తీసుకొచ్చాడు. దీనికి ఆమె నిరాకరించింది. దీంతో ఆమెను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్న టాంగ్ 14 సెప్టెంబరు 2020న రాత్రి పదిన్నర గంటల సమయంలో మాజీ భార్య తండ్రి ఇంటికి వెళ్లి అతనితో గొడవకు దిగాడు. ఆ సమయంలో అక్కడ టిక్‌టాక్‌లో అమచు లైవ్ చేస్తోంది. గమనించిన టాంగ్ వెనక నుంచి వెళ్లి కిరోసిన్ పోసి నిప్పు అంటించి పరారయ్యాడు.

ఈ ఘటనలో అమచుకి 90 శాతం గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ రెండు వారాల తర్వాత ఆమె మృతి చెందింది. ఈ ఘటనలో అమచు తండ్రి ఇల్లు కూడా పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన మొత్తాన్ని లైవ్‌లో చూసిన ఫాలోవర్లు రోడ్డెక్కారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితుడికి మరణశిక్ష విధించాలంటూ లాము హ్యాష్ ట్యాగ్‌తో లక్షలాదిమంది డిమాండ్ చేశారు.

తాజాగా, ఈ కేసును విచారించిన అబాలోని ఇంటర్మీడియెట్ ప్రజా కోర్టు టాంగ్‌ను దోషిగా నిర్ధారించింది. ఉద్దేశపూర్వకంగానే అతడు ఈ హత్యకు పాల్పడ్డాడని పేర్కొంది. టాంగ్ క్రూరమైన నేరానికి పాల్పడ్డాడని పేర్కొంటూ మరణశిక్ష విధించింది.