ఐపీఎల్ ఫైనల్‌కు ముందు తెలుగులో అనర్గళంగా మాట్లాడిన దినేశ్ కార్తీక్.. ఫ్యాన్స్ ఫిదా, వీడియో ఇదిగో!

16-10-2021 Sat 07:45
  • ఐపీఎల్‌లో కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్తీక్
  • హర్షాభోగ్లే తెలుగులో చేసిన ఇంటర్వ్యూకు తడబడకుండా సమాధానాలు
  • మురిసిపోతున్న నెటిజన్లు
  • తెలుగులో ఇంటర్వ్యూ చేస్తానని ఊహించలేదన్న హర్షాభోగ్లే
KKR Player Dinesh Karthik Talking in Telugu In An Interview with Harsha Bhogle
టీమిండియా ఆటగాడు, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న దినేశ్ కార్తీక్ తెలుగు అభిమానుల హృదయాలను దోచుకున్నాడు. చెన్నైతో గత రాత్రి జరిగిన ఐపీఎల్ 2021 ఫైనల్‌కు ముందు ‘స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు’ చానల్‌ కోసం మాట్లాడిన కార్తీక్..  ఎలాంటి తడబాటు లేకుండా స్పష్టంగా తెలుగులో మాట్లాడాడు. కామెంటేటర్ హర్షాభోగ్లే తెలుగులో అడిగిన ప్రశ్నలకు చక్కగా, సూటిగా సమాధానాలు ఇచ్చాడు.

ఫైనల్ మ్యాచ్‌ను కూడా సాధారణ మ్యాచ్‌లానే పరిగణిస్తామన్న డీకే.. ఫైనల్ అనగానే ఎవరికైనా కాస్తంత ఒత్తిడి సహజమన్నాడు. ఒత్తిడిని అధిగమించేందుకు ప్రాక్టీస్ చేసినట్టు చెప్పాడు. తమ జట్టు రెండో అర్ధభాగంలో పుంజుకుందని, అద్భుతంగా రాణించిందని అన్నాడు. జట్టు ఫైనల్‌కు చేరడానికి ఆటగాళ్లందరూ ఎంతగానో శ్రమించారంటూ వారిపై ప్రశంసలు కురిపించాడు.

దినేశ్ కార్తీక్ తెలుగులో మాట్లాడిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అభిమానులు దానిని షేర్ చేస్తూ మురిసిపోతున్నారు. ఎంత చక్కగా మాట్లాడాడో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగులో ఇంటర్వ్యూ చేస్తానని తాను కలలో కూడా ఊహించలేదంటూ హర్షాభోగ్లే సైతం ట్వీట్ చేశాడు.