ఐపీఎల్ ఫైనల్స్.. భారీ స్కోరు సాధించిన చెన్నై

15-10-2021 Fri 21:57
  • 20 ఓవర్లలో 192 పరుగులు చేసిన చెన్నై
  • 86 పరుగులు సాధించిన డుప్లెసిస్
  • దీటుగా ఆడుతున్న కేకేఆర్
CSK scores 192 runs in IPL final
దుబాయ్ లో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్స్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అదరగొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ముందు 193 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. అంతకు ముందు టాస్ గెలిచిన కేకేఆర్ చెన్నై జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. సీఎస్కే ఓపెనర్లు తొలి వికెట్ కు 61 పరుగులు జోడించారు.

తొలి వికెట్ గా రుతురాజ్ గైక్వాడ్ (32) వెనుదిరిగాడు. మరో ఓపెనర్ డుప్లెసిస్ చెలరేగి పోయాడు. 86 పరుగులు సాధించిన డుప్లెసిస్ చివరి బంతికి అవుటయ్యాడు. మరోవైపు రాబిన్ ఊతప్ప 31 పరుగులు చేయగా... మొయిన్ అలీ 37 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కేకేఆర్ బౌలర్లలో సునీల్ నరైన్ రెండు, శివమ్ మావి ఒక వికెట్ పడగొట్టారు. 193 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ దీటుగా ఆడుతోంది. 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్ 13, వెంకటేశ్ అయ్యర్ 21 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.