ఆఫ్ఘనిస్థాన్ లోని గురుద్వారాను అపవిత్రం చేసిన తాలిబన్లు

15-10-2021 Fri 21:00
  • ఈరోజు మధ్యాహ్నం కాబూల్ లోని గురుద్వారాకు వచ్చిన తాలిబన్లు
  • సిక్కు సంఘం అధ్యక్షుడిని బెదిరించిన వైనం
  • అడ్డుకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిక
Talibans enter in Gurudwara in Taliban
ఆప్ఘనిస్థాన్ లో తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత అక్కడి మైనార్టీ ప్రజల బతుకులు ఘోరంగా తయారయ్యాయి. వారిపై దారుణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాబూల్ లోని కర్టే పర్వాన్ లో ఉన్న దష్ మేష్ గురుద్వారాలోకి తాలిబన్లు బలవంతంగా ప్రవేశించారు.

ఈ ఘటనపై ఇండియన్ వరల్డ్ ఫోరమ్ అధ్యక్షుడు పునీత్ సింగ్ చందోక్ మాట్లాడుతూ, ఆయుధాలతో వచ్చిన తాలిబన్లు సిక్కులను భయపెట్టారని చెప్పారు. కాబూల్ లోని సిక్కు సమాజం నుంచి తమకు అనేక కాల్స్ వచ్చాయని తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ దారుణం సంభవించిందని చెప్పారు. ఆయుధాలను ధరించిన కొందరు వ్యక్తులు తాము ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ ప్రత్యేక యూనిట్ కు చెందిన వారమని చెపుతూ గురుద్వారాలోకి బలవంతంగా ప్రవేశించారని తెలిపారు. గురుద్వారాలో ఉన్న సిక్కు సంఘం అధ్యక్షుడిని బెదిరించారని చెప్పారు.

గురుద్వారా అంతా కలియదిరిగారని, పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు లోపలికి ప్రవేశించకుండా అడ్డుకున్న సెక్యూరిటీ గార్డును కొట్టారని, తమను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారని తెలిపారు. గురుద్వారాకు ఆనుకుని ఉన్న స్కూల్ లోకి కూడా ప్రవేశించారని చెప్పారు.