పండగనాడు కొత్త సినిమాను ప్రకటించిన రామ్ చరణ్!

15-10-2021 Fri 16:02
  • గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చరణ్ 
  • ట్విట్టర్ ద్వారా వెల్లడించిన మెగా హీరో
  • 'జెర్సీ'పై చరణ్ రాసిన లేఖను పోస్ట్ చేసిన గౌతమ్
  • ఇంత త్వరగా ఛాన్స్ వస్తుందనుకోలేదంటూ వ్యాఖ్య    
Ram Charan announced his new film with Goutham Tinnanuri
ఇటీవలే 'ఆర్ఆర్ఆర్', 'ఆచార్య' చిత్రాలను పూర్తిచేసి, త్వరలో తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో భారీ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్న మెగా హీరో రామ్ చరణ్.. దసరా రోజున తన కొత్త సినిమాను ప్రకటించారు. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో తాను నటించనున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. 'మీ కథలో నన్ను నేను చూసుకోవడానికి ఎదురుచూస్తున్నాను గౌతమ్..' అంటూ చరణ్ ట్వీట్ చేశాడు.

దీనికి దర్శకుడు గౌతమ్ వెంటనే స్పందిస్తూ.. గతంలో 'జెర్సీ' విడుదలైన సందర్భంగా తనకు చరణ్ రాసిన ఓ లేఖను పోస్ట్ చేశారు. తాను చూసిన ఉత్తమ చిత్రాలలో ఇదొకటని చరణ్ అందులో పేర్కొంటూ, దర్శకుడు గౌతమ్ ను అభినందించారు.

'ఆ లేఖను అప్పటి నుంచీ భద్రంగా దాచిపెట్టుకున్నాను. మీతో కలిసి పనిచేసే అవకాశం వచ్చినప్పుడే, దానిని బహిర్గతం చేయాలని అనుకున్నాను. ఆ అవకాశం ఇంత త్వరగా వస్తుందని అస్సలు అనుకోలేదు. మీరు చూపించే ప్రేమకు థ్యాంక్యూ చరణ్ సార్..' అంటూ తన పోస్టులో దర్శకుడు గౌతమ్ పేర్కొన్నాడు. ఇదిలావుంచితే, శంకర్ సినిమా పూర్తయిన తర్వాత గౌతమ్ తిన్ననూరి చిత్రం సెట్స్ కు వెళుతుందని భావిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ దీనిని నిర్మిస్తుంది.