'మా' ఎన్నికల పరిణామాలపై స్పందించేందుకు నిరాకరించిన రాజేంద్రప్రసాద్

15-10-2021 Fri 15:26
  • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న రాజేంద్రప్రసాద్
  • అమ్మవారి ఆశీస్సులు ఉంటే అన్నీ ఉన్నట్టే అన్న రాజేంద్రప్రసాద్
  • మనవడితో పాటు అందరం వచ్చామని వెల్లడి
Actor Rajendra Prasad says no comment to respond on MAA elections
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల పుణ్యమా అని తెలుగు సినిమా పరిశ్రమ పరువు బజారున పడింది. ఎన్నికల్లో పోటీ పడిన వారు ఒకరిపై మరొకరు చేసుకున్న విమర్శలు జనాలను నోరెళ్లబెట్టేలా చేశాయి. ఇప్పటికీ ఎన్నికల వివాదం సద్దుమణగలేదు.

మరోవైపు ఇండస్ట్రీలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలపై స్పందించేందుకు సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ నిరాకరించారు. ఈరోజు ఆయన విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 'మా'లో జరుగుతున్న తాజా పరిణామాలపై స్పందించాలని ఆయనను మీడియా ప్రతినిధులు కోరగా... 'నో కామెంట్' అంటూ సమాధానాన్ని దాటవేశారు. రాజేంద్రప్రసాద్ గతంలో 'మా' అధ్యక్షుడిగా పని చేసిన సంగతి తెలిసిందే.

మీడియాతో ఇతర విషయాల గురించి ఆయన మాట్లాడుతూ, 'భవానీ అమ్మ మా అమ్మ' అని చెప్పారు. తన చిన్నప్పుడు దుర్గమ్మ తల్లిని తనకు చూపించి ఈమే నీ అమ్మరా అని చెప్పారని అన్నారు. దుర్గమ్మ ఆశీస్సులు ఉంటే అన్నీ ఉన్నట్టేనని చెప్పారు. మూల నక్షత్రం రోజున రావడం కుదరలేదని తెలిపారు. తన మనవడితో పాటు కుటుంబం అంతా వచ్చామని చెప్పారు. నవరాత్రులు, దసరా సందర్భంగా ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు.