తేజ్ క్షేమంగా ఇంటికి రావడం మా కుటుంబానికి ఎంతో సంతోషాన్ని కలిగించింది: పవన్ కల్యాణ్

15-10-2021 Fri 14:31
  • బైక్ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందిన సాయితేజ్
  • అందరి ప్రార్థనలు ఫలించాయన్న పవన్
  • తేజ్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించిన జనసేనాని 
Sai Tej came back to home our family is very happy says Pawan Kalyan
గత నెలలో బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సినీ నటుడు సాయిధరమ్ తేజ్ కోమాలోకి వెళ్లి, ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఆయన పూర్తిగా ఆరోగ్యవంతుడై ఈరోజు ఇంటికి చేరుకున్నారు. తేజ్ ఇంటికి వచ్చిన విషయాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ద్వాదా చెబుతూ, సంతోషాన్ని వ్యక్తం చేశారు.

'అనుకోని రీతిలో ప్రమాదం బారిన పడి గత నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందిన సాయి ధరమ్ తేజ్ కోలుకుని ఈ రోజు క్షేమంగా ఇంటికి చేరాడు. విజయదశమి పర్వదినాన తేజ్ ఆరోగ్యంగా ఇంటికి రావడం మా కుటుంబం అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ రోజు తేజ్ పుట్టిన రోజు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకొని ప్రేక్షకుల ప్రేమాభిమానాలు మరింతగా పొందాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

తేజ్ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి అభిమానులు ఎంతో బాధపడి, తేజ్ క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. ఆలయాల్లో, ప్రార్థనా మందిరాల్లో పూజలు చేశారు. వారందరి ప్రార్థనలు ఫలించాయి. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అని పవన్ తెలిపారు. మరోవైపు తేజ్ ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకోవడంపై ఆయన పెద్ద మేనమామ చిరంజీవి కూడా స్పందించారు. ఈ సందర్భంగా చిరంజీవి స్పందిస్తూ ఇది సాయితేజ్ కు రెండో జన్మ అని పేర్కొన్నారు.