క‌రోనా స‌మ‌యంలో భార‌త‌ సుస్థిరాభివృద్ధికి బాటలు: వాషింగ్ట‌న్ స‌మావేశంలో నిర్మ‌లా సీతారామ‌న్

15-10-2021 Fri 13:04
  • క‌రోనా సంక్షోభాన్ని భారత్‌ ఓ అవకాశంగా మలుచుకుంది
  • కేవలం ఉద్దీపన చర్యలకే పరిమితం కాలేదు
  • నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టాం
  • భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంది
nirmala sitharaman on india economy
క‌రోనా విజృంభ‌ణ వేళ భార‌త ప్ర‌భుత్వం స‌మ‌ర్థంగా ఎన్నో చ‌ర్య‌లు తీసుకుంద‌ని కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ అన్నారు. క‌రోనా సంక్షోభాన్ని భారత్‌ ఓ అవకాశంగా మలుచుకుందని అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్‌లో జరిగిన ప్రపంచ బ్యాంకు అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ... క‌రోనా వేళ భార‌త స‌ర్కారు కేవలం ఉద్దీపన చర్యలకే పరిమితం కాలేద‌ని చెప్పారు.  

నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టి, భార‌త‌ సుస్థిరాభివృద్ధికి బాటలు వేశామ‌ని అన్నారు. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుందని తెలిపారు. క‌రోనా పరిస్థితుల్లోనూ 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు 82 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు వచ్చాయని చెప్పారు. పెట్టుబడులకు భార‌త్ స్వర్గధామమని తెలిపారు. క‌రోనాను భారత్‌ సమర్థంగా ఎదుర్కొందని చెప్పారు.

క‌రోనా స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ జీవితాలతో పాటు జీవనాధారాలను కాపాడడమే లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని తెలిపారు. క‌రోనా రెండో దశ సమయంలోనూ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధి రేటును నమోదు చేశామ‌ని చెప్పారు. క‌రోనా నిబంధ‌న‌ల‌ సడలింపు తర్వాత మూడు నెలల్లో జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటాయ‌ని తెలిపారు. భార‌త్‌లో వేగంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంద‌ని చెప్పారు.