Prakasam District: దర్శి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత డాక్టర్ పిచ్చిరెడ్డి కన్నుమూత

  • గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పిచ్చిరెడ్డి
  • వైద్యుడిగా పదేళ్లపాటు సేవలు
  • దర్శి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక
 Darshi former MLA and YSRCP leader pitchi reddy passes away in Ongole

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే సానికొమ్ము పిచ్చిరెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. బుధవారం ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. మార్కాపురం నియోజకవర్గంలోని కొనకనమిట్ల మండలం పేరారెడ్డిపల్లిలో పిచ్చిరెడ్డి జన్మించారు. ఎంబీబీఎస్ పూర్తిచేసిన అనంతరం పదేళ్లపాటు పొదిలిలో వైద్యుడిగా పనిచేశారు.

ఇందిరాగాంధీ స్ఫూర్తితో 1985లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అదే ఏడాది దర్శి నుంచి పోటీ చేసిన ఆయన పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత 1987లో పొదిలి ఎంపీపీగా ఎన్నికయ్యారు. 1989, 1999 ఎన్నికల్లో దర్శి నుంచి కాంగ్రెస్ తరపున అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు. 1996లో జరిగిన ఉప ఎన్నికతోపాటు 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొంతకాలంపాటు కాంగ్రెస్‌లో కొనసాగిన ఆయన తర్వాత వైసీపీలో చేరారు.

More Telugu News