త్వరలోనే చిరంజీవినీ కలుస్తా: 'మా' కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు

14-10-2021 Thu 15:11
  • ఈరోజు బాలకృష్ణను కలిసిన మంచు విష్ణు, మోహన్ బాబు
  • అందరినీ కలుపుకుని ముందుకెళ్తానన్న విష్ణు
  • ప్రమాణస్వీకారానికి ప్రకాశ్ రాజ్ ను కూడా ఆహ్వానిస్తా
Will meet Chiranjeevi says Manchu Vishnu

మెగాస్టార్ చిరంజీవిని త్వరలోనే కలుస్తానని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. ఈరోజు ఆయన తన తండ్రి మోహన్ బాబుతో కలిసి నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లారు. అనంతరం విష్ణు మాట్లాడుతూ, 'మా' భవన నిర్మాణంలో అండగా ఉంటానని బాలకృష్ణ హామీ ఇచ్చారని చెప్పారు.

అసోసియేషన్ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకుని ముందుకెళ్తానని అన్నారు. ఇప్పటికే పరుచూరి బ్రదర్స్, కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావులను కలిశానని చెప్పారు. చిరంజీవిని కూడా కలుస్తానని తెలిపారు. ఎల్లుండి (16న) ఉదయం 11.45 గంటలకు నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం చేస్తుందనీ... ఆ కార్యక్రమానికి ప్రకాశ్ రాజ్ సహా అందరినీ ఆహ్వానిస్తానని చెప్పారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ చేసిన రాజీనామాలపై ఈసీ మీటింగ్ లో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.