BSF: మూడు రాష్ట్రాల్లో బీఎస్ఎఫ్ పరిధి పెంపు.. గుజరాత్ లో తగ్గింపు!

  • పంజాబ్, ప.బెంగాల్, అసోంలో 50 కిలోమీటర్లకు పెంపు
  • గుజరాత్ లో 80 నుంచి 50కి తగ్గింపు
  • తనిఖీలు, అరెస్టులు చేసే అధికారాలు
BSF Jurisdiction In 3 states Raised To 50 Kilometers

బీఎస్ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం) పరిధిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. అంతర్జాతీయ సరిహద్దులున్న పశ్చిమబెంగాల్, పంజాబ్, అసోంలలో బీఎస్ఎఫ్ అధికారాలను విస్తృతం చేసింది. సరిహద్దుల నుంచి లోపల 50 కిలోమీటర్ల పరిధి వరకు తనిఖీలు చేసేందుకు, నిందితులను అరెస్ట్ చేసేందుకు అధికారాలను ఇచ్చింది. దీనిపై ఇప్పటికే కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ నూ జారీ చేసింది.

ఇటీవలి కాలంలో పాకిస్థాన్ నుంచి డ్రోన్ లు రావడం, ఆయుధాలను జారవిడవడం వంటి ఘటనలు పెరిగిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇంతకుముందు ఈ రాష్ట్రాలలో ఆ పరిధి కేవలం 15 కిలోమీటర్లే ఉండేది. అయితే, తాజా నిర్ణయంలో గుజరాత్ పరిధిని తగ్గించడం వివాదాస్పదమైంది. ఇప్పటిదాకా ఆ రాష్ట్రంలో బీఎస్ఎఫ్ పరిధి 80 కిలోమీటర్లుండగా.. ఇప్పుడు ఆ రాష్ట్రంలోనూ 50 కిలోమీటర్లకే పరిమితం చేశారు. రాజస్థాన్ లో యథావిధిగా 50 కిలోమీటర్లే ఉంచారు.

అయితే, దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి ఇది విరుద్ధమంటూ పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే కొందరు పోలీసు అధికారులూ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.

బీఎస్ఎఫ్ డ్యూటీ కేవలం సరిహద్దు కాపలా అని, చొరబాట్లను నియంత్రించడం వారి విధులని ఓ సీనియర్ అధికారి అన్నారు. అయితే, ఈ నిర్ణయంతో ఏదైనా ఘటనకు సంబంధించి ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చిన వెంటనే తాము చర్యలు తీసుకోవడానికి వీలుంటుందని, స్థానిక పోలీసుల కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదని బీఎస్ఎఫ్ అధికారులు అంటున్నారు.

More Telugu News