ఆర్యన్ ఖాన్ పై రాంగోపాల్ వర్మ వరుస ట్వీట్లు.. డ్రగ్స్ కేసుపై ఆసక్తికర వ్యాఖ్యలు

14-10-2021 Thu 14:50
  • మీడియా, ఎన్సీబీ గొప్పగా లాంచ్ చేశాయని కామెంట్
  • షారుఖ్ పడిన కష్టాల కన్నా జైలు వసతులు మేలేనన్న ఆర్జీవీ
  • షారుఖ్ చూడని ఆర్యన్ రెండో వైపును చూపించారని వ్యంగ్యం
RGV Tweets On Aryan Khan Arrest

షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్లు చేశారు. కనీసం షారుఖ్ కూడా ఆర్యన్ ఖాన్ కు ఇంత ఫేవర్ చేసి ఉండడని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఆ కేసుకు సంబంధించే ఆర్జీవీ వరుస ట్వీట్లను చేశారు. ఎన్సీబీ నిర్మాణ సారథ్యంలో మీడియా డైరెక్షన్ లో ఆర్యన్ ఖాన్ హీరోగా ‘రాకెట్’ అనే సినిమా తెరకెక్కుతోందని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

సూపర్ స్టార్ కుమారుడిని సూపర్ డూపర్ స్టార్ గా మార్చినందుకు ఎన్సీబీకి షారుఖ్ అభిమానులు కృతజ్ఞతలు చెప్పాలన్నారు. తన తండ్రి నుంచి కన్నా జైలు, ఎన్సీబీ నుంచి చాలా నేర్చుకున్నానంటూ ఆర్యన్ భవిష్యత్ లో చెబుతాడని అన్నారు. మీడియా, ఎన్సీబీ అసాధారణ రీతిలో ఆర్యన్ ఖాన్ ను లాంచ్ చేశాయని చెప్పారు. కేవలం తండ్రిగా ఆర్యన్ ను షారుఖ్ సూపర్ స్టార్ ను చేస్తే.. షారుఖ్ చూడని ఆర్యన్ రెండో వైపును చూపించి ఎన్సీబీ సూపర్ సెన్సిటివ్ స్టార్ ను చేసిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

షారుఖ్ ఖాన్ జీవితంలో ఎదగడానికి పడిన కష్టాలతో పోలిస్తే ఆర్యన్ ఉంటున్న జైలు పరిస్థితులు చాలా మెరుగని అన్నారు. ఆర్యన్ ను హింసిస్తున్నారంటూ జనాలు అంటున్నారని, కానీ, అతడిని మెరుగుదిద్దుతున్నారని పేర్కొన్నారు. అతడిని ఓ ప్రకటనల బోర్డుగా దర్యాప్తు సంస్థలు వాడుకుంటున్నాయని ఆరోపించారు. ‘షారుఖ్ కుమారుడినే వదల్లేదు.. మీరెంత?’ అనేట్టుగా జనాలకు ఓ హెచ్చరిక పంపిస్తున్నారని అన్నారు. అయితే, ఈ కేసు ఎలాంటి పరిష్కారం లేకుండానే ముగిసిపోతుందని, విచారణ ప్రక్రియను ఆలస్యం చేసి కేసును మూసేస్తారని అన్నారు.