తిండన్నా, కూరగాయలన్నా పరమభయం.. వాటిని చూస్తేనే వణికిపోతున్న మహిళ!

14-10-2021 Thu 14:04
  • వింత సమస్యతో బాధపడుతున్న ఇంగ్లండ్ మహిళ
  • టమాటా సూప్ తప్ప ఏమీ తీసుకోలేని పరిస్థితి
  • ఓ షోలో తన సమస్యను చెప్పుకొచ్చిన బాధితురాలు
  • ప్రస్తుతం రెండు వారాలకో కొత్త ఫుడ్ ను తీసుకుంటున్న వైనం
England Woman With Extreme Food Phobic Sweats Even Looking At Them

మనం ఏది చేసినా.. ఎంత సంపాదించినా.. పొట్ట కూటి కోసమే. అయితే, ఆ తిండిని చూస్తేనే వణికిపోతోంది ఓ మహిళ. కూరగాయలంటే భయపడిపోతోంది. అవును, ఇంగ్లండ్ లోని నార్త్ యార్క్ షైర్ కు చెందిన చార్లెట్ విటిల్ (34) అనే మహిళకు కూరగాయలు, ఆహార ఫోబియా ఉంది. మరి బతికేందుకు ఆమె ఏం తింటోందన్న డౌట్ రావొచ్చు. కేవలం టమాటా సూప్ మీదే చార్లెట్ బతుకుతోంది. ‘ఎక్స్ ట్రీమ్ ఫుడ్ ఫోబిక్స్’ అనే ఓ టీవీ షోలో ఆమె తన సమస్యలను వివరించింది.

చిన్నప్పట్నుంచే ఆమె ఆ సమస్యతో బాధపడుతోంది. ఏమీ తినేదికాదు. తినకపోతే ఆకలితో అలమటిస్తావని ఆమె తల్లిదండ్రులు చెప్పినా సరిగ్గా తినేదికాదు. బలవంతంగా తిన్నా ఆ వెంటనే టేబుల్ మీదే కక్కేసేది. చిన్నచిన్నగా ఆమెకు తల్లిదండ్రులు చికెన్ నగ్గెట్స్, రైస్ కేకులను అలవాటు చేసినా.. అదీ ఎన్నో ఏళ్ల పాటు సాగలేదు. అవీ ఆమె ఒంటికి పడలేదు. స్కూల్ లో తోటి విద్యార్థుల ముందు, ఆఫీసులో సహోద్యోగుల ముందు ఎన్నో అవమానాలు పడింది.

అంతేకాదు.. ఆహారపదార్థాలను సరిగ్గా సర్వ్ చేయకపోయినా, సరైన వేడితో లేకపోయినా ఆమె తిండిని అస్సలు ముట్టదు. ఆ సమస్యల వల్ల ఇంత వరకు ఆమె డేటింగ్ అన్న మాటే ఎరుగదట. తిండిలేక, సరైన పోషకాలు అందక ఆమె పలు అనారోగ్య సమస్యలకు గురైంది. కాగా, ఆ ఫోబియాను అవాయిడెంట్ రెస్ట్రిక్టివ్ ఫుడ్ ఇన్ టేక్ డిజార్డర్ (ఏఎఫ్ ఆర్ఐడీ) అనే సమస్యతో బాధపడుతోందని ఆ షోలో పాల్గొన్న సైకాలజిస్ట్ ఫీలిక్స్ ఎకనామకిస్ చెప్పారు.

షోలో పాస్తా, ద్రాక్షలను చార్లెట్ ట్రై చేసింది. తృణధాన్యాలు, పిజ్జానూ తిన్నది. రెండు వారాలకో కొత్త ఆహార పదార్థాన్ని ఆమె తీసుకుంటోందట. ప్రస్తుతానికి ఒకే ఒక్క కూరగాయ తినగలుగుతున్నానని, అది చిలగడదుంప అని ఆమె తెలిపింది.