బాల‌కృష్ణ అల్లుడికి వ్య‌తిరేకంగా గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేశాను.. అయినా ఆయన దానిని మనసులో పెట్టుకోలేదు: మోహ‌న్ బాబు

14-10-2021 Thu 13:13
  • మంగ‌ళ‌గిరిలో లోకేశ్ ఓటమికి ప్ర‌చారం చేశాను
  • ఆ విష‌యాన్ని మ‌న‌సులో పెట్టుకోకుండా స‌హ‌క‌రించారు
  • అదీ బాల‌కృష్ణ సంస్కారం
  • ఎన్టీఆరే న‌న్ను బాల‌కృష్ణ ఇంటి వ‌ద్ద‌కు పంపించిన‌ట్లు ఉంది
mohan babu praises balakrishna

గ‌త ఎన్నిక‌ల్లో నంద‌మూరి బాల‌కృష్ణ అల్లుడు లోకేశ్‌కు వ్య‌తిరేకంగా తాను మంగ‌ళ‌గిరిలో ప్ర‌చారం చేశానని, అయినప్ప‌టికీ త‌న కుమారుడు విష్ణుకి బాల‌య్య 'మా' ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తుగా నిలిచార‌ని సినీన‌టుడు మోహ‌న్ బాబు అన్నారు. ఈ రోజు మోహ‌న్ బాబు త‌న కుమారుడితో క‌లిసి బాల‌కృష్ణ‌ను క‌లిసిన విష‌యం తెలిసిందే.

అనంత‌రం మోహ‌న్ బాబు మీడియాతో మాట్లాడుతూ... బాలకృష్ణ గొప్ప సంస్కారం ఉన్న వ్య‌క్తి అని చెప్పారు. మా భ‌వ‌నం విష‌యంలో విష్ణుకు తోడు ఉంటాన‌ని చెప్పారని అన్నారు. ఎన్టీఆరే త‌న‌ను బాల‌కృష్ణ ఇంటి వ‌ద్ద‌కు పంపించిన‌ట్లు ఉందని చెప్పారు.

గ‌త ఎన్నిక‌ల్లో బాల‌య్య అల్లుడి ఓటమికి ప్ర‌చారం చేసిన‌ప్ప‌టికీ అదేమీ ఆయ‌న మ‌న‌సులో పెట్టుకోలేద‌ని చెప్పారు. విష్ణు బాబుకి తోడుగా ఉంటాన‌ని బాల‌కృష్ణ ఇప్ప‌టికే చెప్పారని తెలిపారు. 'బాల‌కృష్ణ‌కు నేను ఇటీవ‌ల ఫోను చేశాను.. మీరు ఎందుకు ఫోను చేశారు? అని అడిగారు. విష్ణు బాబుకే ఓటు వేస్తాన‌ని అన్నారు. అయినా, మీరు చెబితేనే నేను ఓటు వేస్తానా? అని వ్యాఖ్యానించారు' అని మోహ‌న్ బాబు చెప్పారు.