ఉత్తరప్రదేశ్‌లో 17 ఏళ్ల బాలికపై దారుణం.. తండ్రి, వివిధ పార్టీల నాయకులు సహా 28 మంది అత్యాచారం!

14-10-2021 Thu 08:18
  • కన్న కుమార్తెకు అశ్లీల చిత్రాలు చూపించి లొంగదీసుకునే యత్నం
  • పలుమార్లు అత్యాచారం
  • సమాజ్‌వాదీ పార్టీ జిల్లా నేత, బంధువులు కూడా అత్యాచారం చేశారన్న బాలిక
  • తనను ఇరికించే కుట్ర జరుగుతోందన్న తిలక్ యాదవ్
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Girl alleges rape by her father SP BSP leaders in Lalitpur Uttar pradesh

ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జిల్లాలో దారుణం జరిగింది. 17 ఏళ్ల బాలికపై స్వయానా తండ్రి సహా ఎస్పీ, బీఎస్పీ పార్టీల నేతలు, బంధువులు అఘాయిత్యానికి తెగబడ్డారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులకు బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. బాధితురాలి తండ్రి ట్రక్ డ్రైవర్. బాలిక ఆరో తరగతిలో ఉన్నప్పుడే ఆమెకు అశ్లీల చిత్రాలు చూపించి లైంగిక ప్రేరేపణలు కలిగేలా చేసి లొంగదీసుకునే ప్రయత్నం చేసేవాడు. ఓ రోజు కొత్త బట్టలు కొని, బైక్‌పై బయటకు తీసుకెళ్లాడు. ఓ నిర్మానుష్య ప్రదేశంలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయాన్ని బయటపెడితే తల్లిని చంపేస్తానని బెదిరించాడు.

అక్కడితో అతడి అరాచకానికి తెరపడలేదు. ఓ రోజు అన్నంలో మత్తుమందు కలిపి తినిపించాడు. తర్వాత ఓ హోటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇలా పలుమార్లు జరిగింది. ఓసారి సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిలక్ యాదవ్ అనే వ్యక్తి వస్తే బాలిక అడ్డు చెప్పింది. దీంతో అతడు చెప్పింది విని నిర్ఘాంతపోయింది. తండ్రే అతడిని పంపించాడని తెలిసి షాకయ్యింది.

తిలక్ యాదవ్, అతడి సోదరుడు, స్నేహితులు, అతడి బంధువులు, ఆమె బంధువులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ బాధిత బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. బాలిక ఫిర్యాదుతో స్పందించిన తిలక్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తనను, తన సోదరుడిని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.