Ponnala Lakshmaiah: కేసీఆర్ తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారు.. రాష్ట్ర పరిధిలోని నీటిపై కేంద్రం పెత్తనమేంటి?: పొన్నాల

  • కేంద్రం జోక్యానికి రెండు రాష్ట్రాలు అవకాశం ఇచ్చాయి
  • అక్టోబరు 14 తెలంగాణకు బ్లాక్ డేగా నిలిచిపోతుంది
  • కేసీఆర్ ప్రభుత్వం ఒక్క మెగావాట్ విద్యుత్‌ను కొత్తగా ఉత్పత్తి చేయలేదు
Ponnala Lakshmaiah fires on KCR

ఒంటెత్తు పోకడలతో కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని, చివరికి ఆయన తెలంగాణ ద్రోహిగా మిగిలిపోవడం ఖాయమని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రాష్ట్ర పరిధిలోని నీటి వ్యవహారాలపై కేంద్రం పెత్తనం ఏంటని ప్రశ్నించారు. అసలు కేంద్రం జోక్యానికి అవకాశం ఇస్తున్న తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలది తప్పేనని అన్నారు. అక్టోబరు 14 తెలంగాణకు బ్లాక్‌డేగా నిలిచిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశం ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభంపై మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మెగావాట్ విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేయలేకపోయిందని విమర్శించారు. బొగ్గు లేక దేశవ్యాప్తంగా పలు పవర్ ప్లాంటులు మూతపడుతున్నాయని, బీజేపీ ఎన్ని అబద్ధాలు చెబుతున్నా నిజం ఏంటో ప్రజలకు తెలుసని అన్నారు.

వైఎస్సార్ హయాంలో జలయజ్ఞంలో భాగంగా ఒకేసారి 86 ప్రాజెక్టులు ప్రారంభించామని, కేసీఆర్ ఇప్పుడు వెలగబెట్టేదేముందని ప్రశ్నించారు. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం వల్ల ఏమాత్రం లాభం జరిగిందో చెప్పాలని పొన్నాల డిమాండ్ చేశారు.

More Telugu News