పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్!

13-10-2021 Wed 19:15
  • షూటింగు దశలో 'సలార్'
  • సెట్స్ పైనే వున్న 'ఆదిపురుష్'
  • నాగ్ అశ్విన్  తో సైన్స్ ఫిక్షన్
  • 25వ సినిమాలో ప్రభాస్ పాత్రపై ఊహాగానాలు
Prabhas 25th movie update

ప్రభాస్ ఇప్పుడు వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒక వైపున 'సలార్' .. మరో వైపున 'ఆదిపురుష్' సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. వచ్చే ఏడాదిలో ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇది ఒక అద్భుతమైన ప్రయోగమని నాగ్ అశ్విన్ చెప్పడం, అందరిలో మరింత ఆసక్తిని పెంచుతోంది.

ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రభాస్ 25వ సినిమాకి సంబంధించిన ప్రకటన వచ్చింది. ఈ సినిమాకి 'స్పిరిట్' అనే టైటిల్ ను సెట్ చేశారు కూడా. సందీప్ వంగా ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఇప్పటివరకూ తనని ప్రేక్షకులు ఎలా చూడాలని కోరుకున్నారో, ఈ సినిమాలో అలా కనిపిస్తానని ప్రభాస్ అన్నాడు.

ప్రభాస్ మంచి ఒడ్డూ పొడుగు ఉన్న హీరో .. ఆయన వాయిస్ కాస్త కరకుగానే ఉంటుంది. అందువలన ఆయనను పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూడాలని చాలాకాలంగా అభిమానులు ముచ్చటపడుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడట. అందువల్లనే ఆయన ఆ రోజున అలా అన్నాడని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది.