రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి వర్ష సూచన

13-10-2021 Wed 18:34
  • ప్రస్తుతం ఉపరితల ద్రోణి ప్రభావం
  • నేడు, రేపు, ఎల్లుండి వర్షాలు
  • పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు
  • చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం
Rain alert for Andhra Pradesh

ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తుందని, దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్రలపై దీని ప్రభావం ఉంటుందని వివరించింది. ప్రసుత్తం బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఉపరితల ద్రోణి ఏర్పడిందని, ఇది అల్పపీడనానికి దారితీస్తుందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

ఉత్తర కోస్త్రాంధ్రలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు పడతాయని... నేటి నుంచి దక్షిణ కోస్తాంధ్రలో మూడ్రోజుల పాటు ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు పడతాయని వివరించింది. రాయలసీమలోనూ ఇవాళ, రేపు కొన్ని చోట్ల మోస్తరు వర్షం పడొచ్చని, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది.