Suraj: పాముతో భార్యను చంపిన వ్యక్తికి రెండు జీవితఖైదులు

Court imposes two life sentences to a man who killed wife with snake bites
  • కేరళలో ఓ వ్యక్తి ఘాతుకం
  • మరో అమ్మాయి మోజులోపడి భార్య హత్య
  • గతంలో ఓసారి పాముతో కరిపించిన వైనం
  • అత్యంత కఠిన శిక్షలు విధించిన న్యాయమూర్తి
కేరళలో ఓ కిరాతకుడు పాముతో తన భార్యను చంపిన కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. ఈ కేసులో న్యాయస్థానం అత్యంత కఠిన శిక్ష విధించింది. అతనికి రెండు జీవిత ఖైదులు విధించింది. 2020లో కొల్లంలో ఉత్తర (27) అనే వివాహిత పాముకాటుతో చనిపోయింది. ఆమె భర్త సూరజ్ కథనం ప్రకారం... ఓ విషసర్పం ఇంట్లోకి ప్రవేశించి, నిద్రపోతున్న ఉత్తరను రెండుసార్లు కాటేసింది. దాంతో ఆమె మరణించిందని అతడు నమ్మబలికాడు. అందుకు సాక్ష్యంగా చచ్చిన పామును కూడా చూపించాడు.

అయితే, ఉత్తర తండ్రికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్నిరోజుల కిందటే తన కుమార్తె పాము కాటుకు గురైందని, దానికి చికిత్స పొందుతుండగానే మరోసారి పాము కరవడం ఏంటని ఆయన సందేహం వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు సూరజ్ ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, నివ్వెరపోయే నిజాలు వెల్లడించాడు.

రెండో పెళ్లికి అడ్డుగా ఉందన్న కారణంతో తానే ఉత్తరను పాముతో కరిపించి, హత్య చేశానని తెలిపాడు. పాములు పట్టే వ్యక్తి నుంచి విషసర్పాన్ని తీసుకువచ్చానని వివరించాడు. తొలిసారి ఉత్తరను కరిచింది రక్తపింజరి కాగా, రెండోసారి నాగుపాము అని తెలిపాడు. ఉత్తర తన పుట్టింట్లో చికిత్స పొందుతున్న సమయంలో నాగుపామును వదిలినట్టు పేర్కొన్నాడు.

పాములతో మనుషులను చంపడంపై సూరజ్ ఇంటర్నెట్ ను శోధించినట్టు పోలీసులు తెలిపారు. కాల్ డేటాను కూడా పరిశీలించి కీలక ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. దీనిపై విచారణ జరిపిన సెషన్స్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. వాస్తవానికి అతడు చేసిన ఘాతుకానికి మరణశిక్షే కరెక్ట్ అని, కానీ అతడి వయసు 28 ఏళ్లే కావడంతో, అతడికి రెండు జీవిత ఖైదులు విధిస్తున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు.

తొలిగా చేసిన హత్యాయత్నానికి 10 ఏళ్ల జైలు శిక్ష, సాక్ష్యాధారాలను నాశనం చేశాడంటూ ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. ఈ శిక్షలు పూర్తయిన తర్వాత రెండు జీవిత ఖైదుల శిక్ష ప్రారంభం అవుతుందని న్యాయమూర్తి అంతిమతీర్పులో వివరించారు. ఈ శిక్షలతో పాటు రూ.5.85 లక్షల జరిమానా కూడా విధించారు. సూరజ్, ఉత్తరలకు 2018లో వివాహం జరగ్గా, ఓ కుమారుడు జన్మించాడు. మరో అమ్మాయి మోజులో పడిన సూరజ్ ఈ దారుణానికి తెగబడ్డాడు.
Suraj
Uthra
Murder
Snake
Kerala

More Telugu News