USA: అమెరికా పోలీసుల మరో దుశ్చర్య.. పక్షవాతం ఉందని చెప్పినా జుట్టుపట్టి ఈడ్చేసిన వైనం.. ఇదిగో వీడియో

US Police Dragged Black Man By Hair From Car
  • నల్లజాతీయుడిని కారు నుంచి లాగేసిన వైనం
  • పోలీస్ బాడీ క్యామ్ లలో వీడియో రికార్డ్
  • ఒహాయో స్టేట్ లోని డేటన్ లో ఘటన
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
అమెరికాలో మరో జార్జ్ ఫ్లాయిడ్ తరహా ఘటన జరిగింది. తనకు పక్షవాతం ఉందని, కారు దిగలేనని చెప్పినా వినకుండా.. పోలీసులు ఓ నల్లజాతీయుడిని గల్లా పట్టి గుంజి.. జుట్టు పట్టి లాగి కిందకు ఈడ్చేశారు. ఒహాయో రాష్ట్రంలోని డేటన్ లో గత నెల 30న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మొత్తం పోలీసుల బాడీ క్యామ్ లో రికార్డ్ అయింది.

క్లిఫర్డ్ ఒవెన్స్ బై (39) అనే నల్లజాతీయుడు తన కార్ లో ఇంటికి వెళ్తుండగా డేటన్ పోలీసులు ఆపారు. డ్రగ్స్ తనిఖీలు చేయాలని, కారు దిగాలని పోలీసులు క్లిఫర్డ్ ను ఆదేశించారు. అయితే, అందుకు నిరాకరించిన క్లిఫర్డ్.. తనకు పక్షవాతం ఉందని, కారు దిగలేనని చెప్పాడు. తనకు తెలిసిన వారికి ఫోన్ చేసి విషయాన్ని వివరించాడు.

అయితే, అతడి మాటలను ఏ మాత్రం పట్టించుకోని పోలీసులు.. పదే పదే కారు దిగాలని ఒత్తిడి తెచ్చారు. సహనం కోల్పోయిన పోలీసులు అతడిని జుట్టు పట్టి బయటకు లాగేశారు. కిందపడేసి చేతులు కట్టేశారు. తర్వాత కారును చెక్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ తనిఖీల్లో 22,450 డాలర్ల సొమ్ము తప్ప డ్రగ్స్ ఏవీ దొరకలేదని పోలీసులు చెప్పడం వివాదాస్పదమైంది. పోలీసుల చర్యపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సదరు పోలీసులపై దర్యాప్తునకు ఆదేశించారు.

కాగా, గతంలో జార్జ్ ఫ్లాయిడ్ ఘటన ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఫ్లాయిడ్ ను పోలీసులు కారు నుంచి కిందకు లాగి మోకాలితో గొంతుపై అదమడంతో అతడు చనిపోయాడు. ఆ తర్వాత ట్రంప్ ప్రభుత్వంపై పెద్ద పెట్టున ఉద్యమం జరిగిన సంగతి తెలిసిందే. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ అంటూ జనాలు ఆందోళనలు, ఉద్యమాలు చేశారు.

USA
George Floyd
Clifford Owensby
Dayton
Ohio
Police

More Telugu News