ఈగ చెప్పే బాహుబలి కథలు.. ఆకట్టుకుంటున్న బ్రహ్మి పంచతంత్రం టీజర్!

13-10-2021 Wed 14:11
  • అనగనగా ఓ పెద్ద అడవి అంటూ సాగిన టీజర్
  • రేడియో కథకుడిగా బ్రహ్మానందం
  • కీలక పాత్రలో స్వాతి, సముద్ర ఖని
Brahmanandam Panchatantram Teaser Out

బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘పంచతంత్రం’. స్వాతి, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ కలసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక డైరెక్షన్ లో ఇది రూపుదిద్దుకుంటోంది. ఆ సినిమా టీజర్ ఇవాళ విడుదలైంది.

‘‘అనగనగా ఓ పెద్ద అడవి.. ఆ అడవిలోని జంతువులన్నీ ‘కూడు, గూడు, తోడు’ దొరికాక.. నాలుగో జీవనాధారం కోసం చూడసాగాయి. ఆ జీవనాధారమే కథలు. ‘సింహం విసిరిన పంజా కథలు.. చిరుత పెట్టిన పరుగు కథలు.. ఈగ చెప్పే బాహుబలి కథలు.. వినటానికి వచ్చిన వాటికి మైక్ దగ్గర ఓ ముసలి తాబేలు కనిపించింది. కదలడానికే కష్టంగా ఉన్న నువ్వేం కథలు చెప్తావని అడగ్గా.. జవాబుగా ఆకాశమంత అనుభవంతో కథలు మొదలయ్యాయి’’ అంటూ టీజర్ సాగింది.

మొత్తంగా బ్రహ్మి ఈ సినిమాలో రేడియో కథకుడిగా కనిపించబోతున్నట్టు టీజర్ ద్వారా తెలుస్తోంది. స్వాతి కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, భార్య, భర్తల మధ్య జరిగే కథల సమాహారంగా, కుటుంబ కథగా ‘పంచతంత్రం’ టీజర్ కనిపిస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్ లో టీజర్ దూసుకుపోతోంది. మీరూ ఓ లుక్కేసేయండి మరి.