Phone: ప్రాణాలు కాపాడిన స్మార్ట్ ఫోన్.. బుల్లెట్ ను తిప్పికొట్టిన వైనం!

  • బ్రెజిల్ లో ఘటన
  • దగ్గరగా షూట్ చేసిన దోపిడీ దొంగ
  • బతుకుజీవుడా అనుకుంటూ బయటపడిన వైనం
  • ట్విట్టర్ లో ఫొటోలు పోస్ట్ చేసిన డాక్టర్
Mobile Phone Stops Bullet Saves Man From Death

ప్రతి ఒక్కరి జీవితంతో మొబైల్ ఫోన్ విడదీయలేనంతగా పెనవేసుకుపోయింది. తింటూ, చదువుతూ, పనిచేస్తూ, పడుకుంటూ కూడా ఫోన్ లో మొహం పెట్టేవారు లక్షల్లో ఉంటారు. ఆ వ్యసనాన్ని కాస్త తగ్గించుకోవాలంటూ పెద్దలు పదేపదే చెబుతుంటారు. అయితే, అదే ఫోన్ ఒకరి ప్రాణాల్ని నిలిపింది. వేగంగా దూసుకువస్తున్న బుల్లెట్ ను ఆపి ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన బ్రెజిల్ లోని పెట్రోలీనాలో అక్టోబర్ 7న జరిగింది.

ఓ దోపిడీ దొంగ ఓ వ్యక్తి నుంచి దోచుకునేందుకు తుపాకీ ఎక్కుపెట్టి కాల్చాడు. అయితే బుల్లెట్.. ఆ వ్యక్తి షర్ట్ జేబులోని ఐదేళ్ల పాతదైన మోటోరోలా జీ5 ఫోన్ కు తగిలింది. తూటా శక్తి మొత్తం ఫోన్ పైనే పడడంతో ఆ వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది. ఫోన్ స్క్రీన్ బాగా డ్యామేజ్ అయింది తప్ప.. ఫోన్ ను దాటి బుల్లెట్ ముందుకు మాత్రం పోలేకపోయింది. ఫోన్ డ్యామేజ్ అయినా.. ఆ ఫోన్ కు ఉన్న ‘హల్క్’ ప్రొటెక్షన్ కవర్ మాత్రం చెక్కుచెదరలేదంటే నమ్మరేమో.
 
ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను బాధితుడికి చికిత్సనందించిన వైద్యుడు పెడ్రో కార్వాల్హో ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఘటన జరిగిన వెంటనే పెట్రోలీనాలోని యూనివర్సిటీ ఆసుపత్రికి బాధితుడిని తీసుకొచ్చారని, చిన్న గాయం తప్ప పెద్ద గాయాలేవీ కాలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం బాధితుడు క్షేమంగా ఉన్నాడని పెడ్రో  చెప్పారు. బాధితుడి వివరాలను మాత్రం ఆ డాక్టర్ వెల్లడించలేదు.

More Telugu News