లఖింపూర్ ఖేరి హింస ఘటనపై కేంద్ర మంత్రి నిర్మల సంచలన వ్యాఖ్యలు

  • ఖండించాల్సిందేనన్న నిర్మలా సీతారామన్
  • అలాంటివి వేరే రాష్ట్రాల్లోనూ జరుగుతున్నాయని కామెంట్
  • వాటిపై ఎందుకు మాట్లాడడం లేదంటూ అసహనం
  • బీజేపీ పాలిత రాష్ట్రాలనే టార్గెట్ చేసుకుంటారా అని నిలదీత
  • కేంద్ర మంత్రి కాన్వాయ్ కాబట్టి.. వారున్నారని అనుకుంటున్నారు
Nirmala Sitaraman Cooments On Lakhimpur Kheri Violence

లఖింపూర్ ఖేరి హింస ఘటనపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ఘటనను కచ్చితంగా ఖండించి తీరాల్సిందేనన్నారు. ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరిలో కేంద్ర మంత్రి కుమారుడి కాన్వాయ్ లోని కారు ఢీకొని నలుగురు రైతులు మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బీజేపీ కార్యకర్తలు, కారు డ్రైవర్, జర్నలిస్ట్ సహా నలుగురిని రైతులు కొట్టి చంపారు.

ప్రస్తుతం అమెరికా పర్యటనలో వున్న మంత్రి నిర్మల.. బోస్టన్ లోని హార్వర్డ్ కెనడీ స్కూల్ లో విద్యార్థులతో మాటామంతి జరిపారు. ఈ సందర్భంగా లఖింపూర్ ఖేరి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు ఎందుకు స్పందించట్లేదని ఆమెను విద్యార్థులు ప్రశ్నించారు. లఖింపూర్ ఖేరి ఘటనను ఖండించాల్సిందేనని, అయితే, ఇలాంటి ఘటనలే దేశంలోని చాలా చోట్ల జరుగుతున్నాయని, వాటి గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆమె ప్రశ్నించారు.


యూపీలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టే ప్రశ్నిస్తున్నారని, రాజకీయ స్వార్థం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె సమాధానమిచ్చారు. ‘‘ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు, అమర్త్యసేన్ లాంటి వారు గళం విప్పుతున్నారు. మంచిదే. అయితే, అది కేవలం వారికి సూట్ అవుతుందనిపిస్తేనే మాట్లాడుతున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరిగితేనే గొంతెత్తుతున్నారు. వేరే చోట జరిగితే ఎందుకు మాట్లాడడం లేదు? వాటిపైనా మాట్లాడితే బాగుంటుంది. అక్కడ కేంద్ర మంత్రి కార్యక్రమం ఉంది కాబట్టి.. ఘటనకు మంత్రి, ఆయన కుమారుడే కారణమని అనుకుంటున్నారు. సమగ్ర విచారణ తర్వాత నిందితులకు శిక్ష పడుతుంది. బాధితులకు న్యాయం జరుగుతుంది’’ అని ఆమె అన్నారు.

ఇది సొంత పార్టీ, ప్రధాని నరేంద్ర మోదీని వెనకేసుకొచ్చేందుకు ఈ వ్యాఖ్యలు చేయట్లేదని, భారత్ కోసం చేస్తున్నానని ఆమె పేర్కొన్నారు. తాను దేశం కోసం మాట్లాడతానని, పేదలకు న్యాయం కోసం మాట్లాడతానని చెప్పారు. తనను తాను కాపాడుకోవడానికి చేసే కామెంట్లయితే.. నిజాలు మాట్లాడుకుందామంటూ పక్కదారి పట్టించేదాన్నని అన్నారు. 2014లో బీజేపీ అధికారం చేపట్టాక.. సాగుచట్టాలపై అన్ని రాష్ట్రాలతో చర్చించామని, ఆ తర్వాతే వాటిని తీసుకొచ్చామని ఆమె తెలిపారు. లోక్ సభలోనూ విస్తృత చర్చ జరిగిందని గుర్తు చేశారు. రాజ్యసభకు వచ్చేసరికి నానా రచ్చ చేశారని, ప్రతిపక్షాలు దారుణంగా వ్యవహరించాయని అసహనం వ్యక్తం చేశారు.

ఇప్పుడు నిరసన చేస్తున్న వారంతా కేవలం ఒక్క రాష్ట్రానికి చెందిన వారేనని, హర్యానా, యూపీల్లోని కొన్ని ప్రాంతాలకు చెందినవారూ కొందరున్నారని అన్నారు.  నిరసన చేస్తున్న వారికే చట్టాల్లో ఉన్న తప్పేంటో తెలియదని, అడిగినా వారు ఒక్క తప్పునూ చెప్పడం లేదని అన్నారు. తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నా వారు వినే పరిస్థితుల్లో లేరని చెప్పారు.

More Telugu News