ఆరు నెలల తర్వాత నిన్ను కూడా అవతల పెడతారు: హరీశ్ రావుపై రఘునందన్‌ సంచలన వ్యాఖ్యలు

13-10-2021 Wed 10:47
  • హరీశ్ అన్నా బాగా ఎగురుతున్నావట  
  • అప్పుడు మళ్లీ హరీశ్ అన్నను గెలిపించండి అంటూ మన యువకులు తిరగాల్సి ఉంటుంది
  • దోచుకోవాలి అనుకుని ఉంటే ఈటల ఐదేళ్లు మంత్రిగా ఉండేవారు
Raghunandan Rao sensational comments on Harish Rao

'హరీశ్ అన్నా బాగా ఎగురుతున్నావట. ఆరు నెలల తర్వాత నిన్ను కూడా అవతల పెడతారు' అంటూ మంత్రి హరీశ్ రావుపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ మన హరీశ్ అన్నని గెలిపించాలి అంటూ మన యువకులు తిరగాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రసంగిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఇతర ఎమ్మెల్యేల మాదిరి దోచుకోవడం, దాచుకోవడమే ముఖ్యమని ఈటల రాజేందర్ అనుకుని ఉంటే ఐదేళ్లు మంత్రిగా ఉండేవాడని చెప్పారు. దుబ్బాకలో రఘునందన్‌ రావు గెలిస్తే పింఛన్ కట్ అవుతుందని హరీశ్ అప్పట్లో అన్నారని సంవత్సరం పూర్తయినా ఒక్క పింఛన్ కూడా పోలేదని అన్నారు.

హరీశ్ రావు ఇంట్లో నుంచి మనకు పింఛన్లు రావడం లేదని మనం కట్టిన పన్నుల నుంచే మనకు పింఛన్లు వస్తున్నాయని రఘునందన్ రావు చెప్పారు. కొడుకు, అల్లుడికి మంత్రి పదవులు, బిడ్డకు ఎమ్మెల్సీ పదవిని, మధ్యాహ్నం, రాత్రి గోలీలు అందించే సంతోశ్ కు ఎంపీ పదవిని ఇచ్ఛారంటూ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.