అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతి.. రూ. 25 లక్షలు మంజూరు చేసిన కేసీఆర్

13-10-2021 Wed 06:54
  • పీఎన్ఎన్ వ్యాధి బారినపడిన శివాని
  • మంత్రి నిరంజన్ రెడ్డితో మొరపెట్టుకున్న శివాని తండ్రి
  • శివాని తండ్రికి చెక్కు అందజేత
Rs 25 lakh granted to shivani to medical expenditure for shivani
అరుదైన వ్యాధితో బాధపడుతున్న యువతి చికిత్స కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 25 లక్షలు మంజూరు చేశారు. హైదరాబాద్‌లోని పీర్జాదిగూడకు చెందిన శివాని ‘పారక్సిస్మల్ నాక్టర్నల్ హిమోగ్లోబినురియా’ (పీఎన్ఎన్) వ్యాధితో బాధపడుతోంది. శివానిది ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రేవల్లి కాగా, 20 ఏళ్ల క్రితం వీరి కుటుంబం హైదరాబాద్ వచ్చి స్థిరపడింది. శివాని తండ్రి బాల్‌రెడ్డి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.

శివాని అరుదైన వ్యాధి చికిత్సకు రూ. 30 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో బాల్‌రెడ్డి హతాశులయ్యారు. అంత ఖర్చు పెట్టే స్తోమత లేకపోవడంతో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిని కలిసి కుమార్తె పరిస్థితి వివరించారు. ఆయన ఆ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా రూ. 25 లక్షలు మంజూరు చేశారు. నిరంజన్‌రెడ్డి నిన్న ఆ చెక్కును బాల్‌రెడ్డికి అందించారు.