నాకు మా అమ్మే అన్నీ... అమ్మను కించపరిచేలా మోహన్ బాబు బూతులు తిట్టారు: తనీశ్ ఆవేదన

  • ప్రకాశ్ రాజ్ ప్యానెల్ మీడియా సమావేశం
  • మోహన్ బాబు దారుణంగా తిట్టారన్న తనీశ్
  • చాలా బాధ కలిగిందని వెల్లడి
  • తన వల్ల బెనర్జీ కూడా మాటలు పడ్డాడని వివరణ
  • బెనర్జీకి క్షమాపణలు
Tanish alleges Mohan Babu behavior at polling booth

ఈ సాయంత్రం ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ సభ్యులతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న యువ నటుడు తనీశ్ మాట్లాడుతూ, తీవ్ర బాధకు లోనయ్యారు. పోలింగ్ సందర్భంగా మోహన్ బాబు తనను దారుణంగా తిట్టారని ఆరోపించారు. తనకు తల్లే అన్నీ అని, అలాంటి అమ్మను కించపరిచేలా మోహన్ బాబు తిట్టారని వెల్లడించారు. ఆ సమయంలో ఎంతో బాధ కలిగిందని అన్నారు. మధ్యలో వచ్చిన బెనర్జీని కూడా మోహన్ బాబు భయంకరంగా తిట్టారని తెలిపారు. అయితే తాము తీవ్రంగా ప్రతిస్పందించకుండా మంచు విష్ణు నిలువరించాడని తనీశ్ పేర్కొన్నాడు.

తాను ఇలా ఏ రోజూ మీడియా ముందుకు వచ్చింది లేదని, వివాదాలకు తాను దూరమని స్పష్టం చేశారు. ఇవాళ తాను మా ఈసీ మెంబర్ పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తనకు ఓటేసిన వారందరికీ క్షమాపణలు చెబుతున్నానని తనీశ్ వెల్లడించారు. ఇక నా వల్ల బెనర్జీ కూడా మాటలు పడ్డారని, ఆయనకు క్షమాపణలు తెలుపుతున్నానని వివరించారు. మంచు విష్ణు, మనోజ్ తనకు ఎంతో కావాల్సిన వారని, కానీ ప్రకాశ్ రాజ్ ఆలోచనలు నచ్చడం వల్లే ఆయన ప్యానెల్ నుంచి పోటీ చేశానని స్పష్టం చేశారు.

More Telugu News