దసరా పండుగకు టీఆర్ఎస్ వాళ్లే మాంసం, డబ్బులు పంపిస్తారట... తీసుకుని నాకే ఓటేయండి: ఈటల
- హుజూరాబాద్ లో ఉప ఎన్నిక
- జమ్మికుంటలో నేడు ఈటల ప్రచారం
- భారీ ర్యాలీ నిర్వహించిన బీజేపీ
- కేసీఆర్ చెంప చెళ్లుమనిపించేలా తీర్పు ఇవ్వాలన్న ఈటల
ఇప్పటివరకు తనతో ఉన్నవారు తనను వీడిపోయారని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ గెలిచిన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లను గెలిపించింది ఎవరు? అని ప్రశ్నించారు. నా అండ లేకుండానే వారు గెలిచారా? అని ఈటల నిలదీశారు. ఇవాళ వారిలో ఒక్కరూ కూడా తన పక్కన లేరని, వారందరూ వెళ్లిపోయినా ప్రజలందరూ తనతో ఉన్నారని ఈటల స్పష్టం చేశారు. ప్రజలు తన వెంటే ఉన్నారనడానికి ఇవాళ్టి ర్యాలీనే నిదర్శనమని తెలిపారు.
"నా పేరు చెప్పుకోకుండా ప్రజల వద్దకు వెళ్లడానికి టీఆర్ఎస్ వాళ్లకు ముఖం చెల్లడంలేదు. దసరా పండుగకు కూడా టీఆర్ఎస్ వాళ్లే మాంసం, డబ్బులు పంపిస్తారట. ఒక్కో ఓటుకు రూ.10 వేలు ఇస్తారట... వాళ్లు రూ.50 వేలు ఇచ్చినా తీసుకోండి... ఓటు మాత్రం నాకే వేయండి" అంటూ ఈటల విజ్ఞప్తి చేశారు. 'కేసీఆర్ డబ్బు, మద్యం హుజూరాబాద్ లో చెల్లవు అని ఆయన చెంప చెళ్లుమనిపించేలా 30వ తేదీన తీర్పు ఇవ్వాలని ప్రజలందరినీ కోరుతున్నా' అని పేర్కొన్నారు.