Atchannaidu: టీడీపీ శ్రేణులపై కేసులు... హైకోర్టు న్యాయవాదులతో చర్చించిన అచ్చెన్నాయుడు

  • అక్రమ కేసులు బనాయించారంటున్న టీడీపీ నాయకత్వం
  • కేసులు, విచారణల పురోగతిపై అచ్చెన్నాయుడు సమీక్ష
  • న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న వైనం
  • వైసీపీ సర్కారుపై బుచ్చయ్య చౌదరి వ్యంగ్యం
Atchannaidu reviews cases and hearings on TDP workers

వివిధ సందర్భాల్లో తమ నేతలు, కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందంటూ టీడీపీ అధినాయకత్వం ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై నమోదైన కేసులు, వాటి విచారణల పురోగతిని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షించారు. ఇవాళ పార్టీ కార్యాలయంలో హైకోర్టు న్యాయవాదులు, న్యాయ నిపుణులతో సమావేశమై కేసులపై చర్చించారు. న్యాయ నిపుణుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు.

అటు, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ సర్కారుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైసీపీ సర్కారులో జగన్ రెడ్డి 'సలహాదారులు' అనే బదులుగా జగన్ 'పైరవీకారులు అనడం కరెక్ట్ అని ఎద్దేవా చేశారు. ఎందుకంటే వారు ఇప్పటివరకు ప్రజలకు మేలు చేసే ఒక్క సలహా కూడా ఇవ్వలేదని గోరంట్ల విమర్శించారు.

అంతేకాదు... జగనన్న కానుక, జగనన్న దీవెన అంటూ పథకాలకు పేర్లు పెడుతున్నారని, ఇప్పుడు రాష్ట్రంలో విద్యుత్ కోతలకు కూడా 'జగనన్న చీకటి పథకం' అని పేరుపెడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. 200 మందికి పైగా ఉన్న సలహాదారులు ఈ విషయం ఒకసారిగా గ్రహించాలని పేర్కొన్నారు.

More Telugu News