రజనీకాంత్ క్రేజ్.. భారీ రేటుకి 'అన్నాత్తే' తెలుగు డబ్బింగ్ రైట్స్!

12-10-2021 Tue 16:15
  • రజనీ సినిమాలకు తెలుగులో కూడా డిమాండ్ 
  • శివ దర్శకత్వంలో రజనీ తాజా చిత్రం 'అన్నాత్తే'
  • 12 కోట్లకు అమ్ముడుపోయిన తెలుగు రైట్స్
  • కీలక పాత్రల్లో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తి సురేశ్        
Rajanikanths Annatte Telugu version sold for a bomb

సూపర్ స్టార్ రజనీకాంత్ కు వుండే క్రేజే వేరు. ఆయన సినిమా ఒకటి వస్తోందంటే ఇక అందరి చూపూ దానిపైనే ఉంటుంది. ఇక బిజినెస్ పరంగా అయితే చెప్పేక్కర్లేదు. బాలీవుడ్ హీరోలు సైతం కళ్లు తేలేసేలా ఆయన సినిమాల బిజినెస్ జరుగుతుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా తమిళులు ఉండడంతో పలు దేశాలలో ఆయన నటించే సినిమాలు విడుదలవుతుంటాయి.

ఇక రజనీకాంత్ తెలుగు ప్రేక్షకులకూ ఆరాధ్యుడే! తన కెరీర్ తొలినాళ్లలో ఎక్కువగా తెలుగు సినిమాలలోనే నటించాడు. అందుకే, ఇప్పటికీ ఆయన సినిమాలు తెలుగులోకి డబ్ అవుతూ ఉంటాయి. పైపెచ్చు వాటికి ఎంతో డిమాండ్ కూడా ఉంటుంది. ఇటీవలి కాలంలో అయితే ఈ డబ్బింగ్ రైట్స్ రేటు బాగా పెరిగిపోయింది.

ఈ క్రమంలో వస్తున్న ఆయన కొత్త చిత్రం తెలుగు వెర్షన్ హక్కులు 12 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. శివ దర్శకత్వంలో రజనీ హీరోగా 'అన్నాత్తే' చిత్రం రూపొందుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ చిత్రం తెలుగు అనువాదం రైట్స్ 12 కోట్లు పలికినట్టు చెబుతున్నారు.

ఇందులో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తి సురేశ్ లీడ్ క్యారెక్టర్లు పోషించడంతో ప్రాజక్టుకి మరింత గ్లామర్ పెరిగింది. నవంబర్ 4న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.