'జై బాలయ్య' అంటున్న గోపీచంద్ మలినేని!

12-10-2021 Tue 12:41
  • ప్రస్తుతం 'అఖండ' పూర్తి చేస్తున్న బాలకృష్ణ 
  • తదుపరి చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం
  • పరిశీలనలో 'జై బాలయ్య' అనే టైటిల్
  • మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మాణం  
Balakrishnas new film title Jai Balayya

మన స్టార్ హీరోల సినిమాలకు కథ కోసం ఎంతటి కసరత్తు చేస్తారో.. టైటిల్ నిర్ణయించడానికి కూడా అంతగానూ కసరత్తు చేస్తారు. అభిమానులను ఆకట్టుకునేలా పవర్ ఫుల్ టైటిల్ పెట్టడానికి ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలో రకరకాల టైటిల్స్ ని పరిశీలిస్తుంటారు.

ఇక బాలకృష్ణ లాంటి విపరీతమైన మాస్ ఫాలోయింగ్, అభిమాన గణం వున్న హీరోకైతే చెప్పేక్కర్లేదు. టైటిల్ అదిరిపోవాలి.. బాలయ్య ఇమేజ్ కి అతికినట్టు సరిపోవాలి. ఇప్పుడు బాలకృష్ణ నటించే కొత్త సినిమాకి కూడా అలాగే 'జై బాలయ్య' అనే పవర్ ఫుల్ టైటిల్ పెడుతున్నారు.

ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో 'అఖండ' చిత్రాన్ని పూర్తిచేస్తున్న బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ   చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా జరుగుతున్నాయి. బాలయ్య ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని తయారు చేసుకున్న పవర్ ఫుల్ సబ్జెక్టుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి 'జై బాలయ్య' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారు. దాదాపు ఇదే ఫైనల్ కావచ్చని అంటున్నారు.

ఇక వచ్చే నెలలో ఈ చిత్రం షూటింగును లాంఛనంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి తమన్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. ఇది బాలకృష్ణ నటించే 107వ చిత్రం అవుతుంది. త్వరలోనే ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తారు.