Uttarakhand: ఉత్తరాఖండ్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన రవాణా మంత్రి, ఎమ్మెల్యే సంజీవ్

Uttarakhand Minister Yashpal Arya joins in Congress
  • కాంగ్రెస్‌లో చేరడానికి ముందే గవర్నర్‌కు రాజీనామా లేఖలు
  • బీజేపీలో ఒక్క రోజు కూడా సంతోషంగా లేనన్న యశ్‌పాల్ ఆర్య
  • పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ
వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్ధమవుతున్న ఉత్తరాఖండ్‌లో అధికార బీజేపీకి షాక్ తగిలింది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి యశ్‌పాల్ ఆర్య, ఆయన కుమారుడైన ఎమ్మెల్యే సంజీవ్‌ ఆర్య బీజేపీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో నిన్న సీనియర్ నేతలు హరీశ్ రావత్, కేసీ వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలా సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. యశ్‌పాల్ గతంలో పీసీసీ చీఫ్‌గా పనిచేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీలో తాను ఒక్క రోజు కూడా సంతోషంగా లేనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో చేరడం తిరిగి సొంతింటికి వచ్చినంత ఆనందంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిస్వార్థంగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు. సూర్జేవాలా మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో దళితుల అభివృద్ధికి యశ్‌పాల్ విశేష కృషి చేశారని కొనియాడారు. కాగా, కాంగ్రెస్‌లో చేరడానికి ముందే యశ్‌పాల్, ఆయన కుమారుడు సంజీవ్ తమ రాజీనామా లేఖలను గవర్నర్‌కు పంపారు.
Uttarakhand
BJP
Congress
Yashpal Arya
Sanjeev Arya

More Telugu News