IPL 2021: కోహ్లీ సేనకు మళ్లీ నిరాశ.. కోల్‌కతా చేతిలో ఓడిన బెంగళూరు

  • కీలక మ్యాచ్‌లో చతికిలపడిన బెంగళూరు
  • బెంగళూరును చావుదెబ్బ కొట్టిన నరైన్
  • ఢిల్లీతో రేపు కోల్‌కతా తాడోపేడో
Kolkata won against Bengaluru in Eliminator

వరుస విజయాలతో ఎలిమినేటర్‌కు దూసుకొచ్చిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రాత ఈసారీ మారలేదు. ఈ సీజన్‌లో బెంగళూరు జోరు చూసి 14 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు ఈసారి తెరపడుతుందని అభిమానులు భావించారు. కానీ వారి ఆశలు అడియాసలే అయ్యాయి. కీలక మ్యాచ్‌లో కోహ్లీ సేన పేలవ ప్రదర్శన కారణంగా ఫైనల్ అవకాశాలను చేజార్చుకుంది. కెప్టెన్‌గా కప్పుకొట్టాలన్న కోహ్లీ ఆశలను కోల్‌కతా చిదిమేసింది. ఆల్‌రౌండర్ నైపుణ్యంతో అదరగొట్టిన కోల్‌కతా విజయం సాధించి ఢిల్లీతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది.

సునీల్ నరైన్ బంతితో విజృంభించడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 138 పరుగులకే పరిమితం కాగా, ఆ తర్వాత స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌కతా చివరి ఓవర్ వరకు ఆడి ఉత్కంఠ రేపినప్పటికీ విజయాన్ని మాత్రం అందుకుంది. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు మాత్రమే కోల్పోయి గెలుపొందింది. శుభమన్ గిల్ 29, వెంకటేశ్ అయ్యర్ 26, నితీశ్ రాణా 23, సునీల్ నరైన్ 26 పరుగులు చేశారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ను సునీల్ నరైన్ వణికించాడు. వరుస వికెట్లు తీస్తూ జట్టు భారీ స్కోరు చేయకుండా అడ్డుకట్ట వేశాడు. కోహ్లీ (39) శ్రీకర్ భరత్ (9), మ్యాక్స్‌వెల్ (15), డివిలియర్స్ (11) వంటి ఆటగాళ్లను పెవిలియన్ పంపి చావుదెబ్బ తీశాడు. లాకీ ఫెర్గ్యూసన్ రెండు వికెట్లు పడగొట్టాడు. కోహ్లీ తర్వాత పడిక్కల్ చేసిన 21 పరుగులే జట్టులో అత్యధికం.

139 పరుగుల విజయలక్ష్యాన్ని కాపాడుకునేందుకు చివరి వరకు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఫలితంగా ఈసారి కూడా కోహ్లీ సేనకు నిరాశే మిగిలింది. కప్పు కోసం బెంగళూరు అభిమానులు మరో ఏడాది నిరీక్షించక తప్పని పరిస్థితి ఏర్పడింది. నాలుగు ఓవర్లు వేసి 21 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడమే కాకుండా, 15 బంతుల్లో 3 సిక్సర్లతో 26 పరుగులు చేసిన సునీల్ నరైన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

కాగా, ఈసారి ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్ (626)కు ఆరెంజ్ క్యాప్ లభించింది. 32 వికెట్లు తీసిన బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్‌కు పర్పుల్ క్యాప్ లభించింది. రేపు జరగనున్న క్వాలిఫయర్ -2లో ఢిల్లీ, కోల్‌కతా జట్లు తలపడతాయి.

More Telugu News