MSK Prasad: టీ20 వరల్డ్ కప్ లో కోహ్లీ-ధోనీ జోడీ అద్భుతాలు చేస్తుంది: ఎమ్మెస్కే ప్రసాద్

  • అక్టోబరు 17 నుంచి టీ20 వరల్డ్ కప్
  • టీమిండియా మెంటార్ గా ధోనీ
  • కోహ్లీకి ధోనీ అండగా ఉంటాడన్న ఎమ్మెస్కే
  • జట్టులో చహల్ లేకపోవడం లోటేనని వెల్లడి
MSK opines on Team India chances in ICC mega tourney

టీమిండియా సెలెక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు విజయావకాశాలపై స్పందించాడు. ఈ వరల్డ్ కప్ కోసం టీమిండియా మెంటార్ గా ధోనీ నియమితుడు కావడం తెలిసిందే. జట్టుకు సలహాదారుగా ధోనీ నియామకం సరైనదేనని ఎమ్మెస్కే అభిప్రాయపడ్డాడు. టీ20 ప్రపంచకప్ లో ధోనీ మాస్టర్ మైండ్, కోహ్లీ కెప్టెన్సీ అద్భుతాలు చేస్తాయని ధీమా వ్యక్తం చేశాడు. తొలిసారి ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలని భావిస్తున్న కోహ్లీకి ధోనీ అండగా ఉంటాడని తెలిపాడు.

ఇక, టీ20 వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్ కు చహల్ వంటి స్పిన్నర్ లేకపోవడం లోటేనని ఎమ్మెస్కే అభిప్రాయపడ్డాడు. టీ20 జట్టులో చహల్ లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నాడు.

సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ను ఎందుకు తీసేశారో తనకు కారణాలు తెలియని అన్నాడు. అయితే ఐసీసీ టోర్నమెంట్లలో ధావన్ కు మెరుగైన రికార్డు ఉందని గుర్తుచేశాడు. రోహిత్ శర్మ, ధావన్ జోడీ గత ఐసీసీ టోర్నీల్లో ఎంతటి విధ్వంసం సృష్టించిందో అందరికీ తెలుసని వివరించాడు. కాగా, టీ20 వరల్డ్ కప్ ఈ నెల 17 నుంచి యూఏఈ, ఒమన్ దేశాల్లో జరగనున్న సంగతి తెలిసిందే.

More Telugu News