Manchu Vishnu: నాగబాబు రాజీనామాను నేను ఆమోదించను: మంచు విష్ణు

  • మా ఎన్నికల్లో మంచు విష్ణు ఘనవిజయం
  • మా సభ్యత్వానికి రాజీనామా చేసిన నాగబాబు
  • ఆవేశంతో తీసుకున్న నిర్ణయమన్న మంచు విష్ణు
  • పర్సనల్ గా కలుస్తానని వెల్లడి
Manchu Vishnu says he do not approve Nagababu resignation

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఘన విజయం తర్వాత మంచు విష్ణు తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. తమ ప్యానెల్ ప్రమాణస్వీకారం తేదీ త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఇక నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంపై స్పందిస్తూ, మా కుటుంబ పెద్దల్లో నాగబాబు ఒకరని స్పష్టం చేశారు.

ఆయన మనస్తాపం చెంది, ఆవేశంలో తీసుకున్న రాజీనామా నిర్ణయాన్ని తాను అధ్యక్షుడిగా ఆమోదించబోనని మంచు విష్ణు వెల్లడించారు. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో నిరాశ అందరికీ ఉంటుందని, త్వరలోనే నాగబాబును కలిసి, ఆయనతో మాట్లాడతానని తెలిపారు. అలాగే ప్రకాశ్ రాజ్ రాజీనామాపైనా తమ నిర్ణయం అదేనని వివరించారు.

ప్రకాశ్ రాజ్ ను తాను ఎంతో అభిమానిస్తానని, నిన్న ఓట్ల లెక్కింపు సందర్భంగా తాము ఎంతో సన్నిహితంగా మెలిగామని, ఎన్నో విషయాలు మాట్లాడుకున్నామని వివరించారు. ఆట మొదలైందని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు కదా? అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా... మా అభివృద్ధి ఎలా చేయాలన్న ఆట ఇప్పుడే మొదలైందని, ప్రకాశ్ రాజ్ ఆలోచనలు కూడా తీసుకుని ముందుకు వెళతామని మంచు విష్ణు వివరణ ఇచ్చారు.

గెలుపోటములు రెండూ మోసకారి అంశాలేనని, వీటిని హృదయంలోకి తీసుకోనని, ప్రకాశ్ రాజ్ అవసరం తమకు ఎంతో ఉందని స్పష్టం చేశారు. నాన్ లోకల్ అంశం ప్రకాశ్ రాజ్ ఓటమికి కారణం అంటే తాను విశ్వసించబోనని పేర్కొన్నారు. 650కి పైగా ఓట్లు పోలైతే 265 మంది ప్రకాశ్ రాజ్ కు ఓటేశారని, వారందరూ ప్రకాశ్ రాజ్ కావాలని కోరుకున్నవారే కదా అని విష్ణు వివరించారు. ఇక నాన్ లోకల్ అంశం ఎక్కడ అని ప్రశ్నించారు.

More Telugu News