'డబ్బు లేని ఇంటికి తాళం వేయడం ఎందుకు కలెక్టర్?'.. అంటూ లేఖను వదిలి వెళ్లిన దొంగలు

11-10-2021 Mon 15:25
  • మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఘటన
  • డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో చోరీ
  • తాళం వేసిన ఇంట్లోకి చొరబడిన దొంగలు
  • రూ.30 వేల నగదు, నగలు, కొన్ని వస్తువుల చోరీ
  • దొంగలు తీవ్ర నిరాశకు గురైన వైనం
Thieves express their disappointment

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఓ డిప్యూటీ కలెక్టర్ అధికారిక నివాసంలో చోరీ జరిగింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఇది గమనించిన దొంగలు ఇంట్లో చొరబడి రూ.30 వేలు నగదుతో పాటు నగలు, కొన్ని వస్తువులు చోరీ చేశారు. ఎంతో ఆశతో దొంగతనానికి వచ్చిన వారు అక్కడ పెద్దగా గిట్టుబాటు కాకపోవడంతో నిరాశకు గురయ్యారు.

పెద్ద అధికారి ఇంట్లో కొద్ది మొత్తంలోనే నగదు లభించడంతో వారు ఓ కాగితంపై తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. "డబ్బుల్లేని ఇంటికి తాళం వేయడం ఎందుకు కలెక్టర్?" అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ చీటిని డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో వదిలి వెళ్లారు. కొన్ని వారాల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన ఆ అధికారి కుటుంబం దొంగల లేఖను చూసి దిగ్భ్రాంతికి గురైంది. తన ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని డిప్యూటీ కలెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.