నాకు, సమంతకు ఎఫైర్ ఉందని ప్ర‌చారం జ‌రుగుతోంది.. నాగచైతన్య ఎందుకు స్పందించడం లేదు?: ప్రీతం

11-10-2021 Mon 11:26
  • చాలా మంది న‌న్ను తిడుతున్నారు
  • బ‌య‌టికొస్తే చంపేస్తామంటున్నారు
  • స‌మంత‌ను అక్క అని పిలుస్తాను
  • మా మ‌ధ్య ఉన్న అనుబంధం చైతూకి తెలుసు
  • స‌మంత‌కు మ‌ద్ద‌తుగా ఉంటా
preetam fires on netizens

టాలీవుడ్ జంట‌ నాగ చైతన్య, సమంత విడిపోయిన నేప‌థ్యంలో ఇందుకు కార‌ణం సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ అంటూ నెటిజ‌న్లు మండిప‌డుతోన్న విష‌యం తెలిసిందే. దీనిపై ప్రీత‌మ్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడాడు. తాను సమంతను అక్కా అని పిలుస్తానని, ఈ విష‌యం చాలా మందికి తెలుసని చెప్పాడు. ఇక త‌మ‌ మధ్య ఎఫైర్ ఎందుకు ఉంటుందని అన్నాడు.

తాను గ‌తంలో ఐ లవ్యూ అని సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేయ‌డంపై కొంద‌రు త‌న‌ను ప్ర‌శ్నిస్తున్నార‌ని తెలిపాడు. కుటుంబ సభ్యులకు, సోదరిగా భావించే వారికి ఐ లవ్యూ చెప్పడం తప్పా? అని ఆయ‌న ప్ర‌శ్నించాడు. త‌న‌ను తిడుతూ చాలా మంది మెసేజ్‌లు చేస్తున్నారని ఆయ‌న చెప్పాడు.

అంతేగాక‌, ఇంటి నుంచి బయటకు వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నార‌ని, త‌న‌ కెరీర్‌ను నాశనం చేస్తామంటున్నార‌ని వాపోయాడు. మ‌రోవైపు, త‌న త‌ల్లి చనిపోయిందని కొన్ని వెబ్‌సైట్లు రాస్తున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

త‌న‌కు నాగచైతన్య ఎన్నో ఏళ్లుగా తెలుస‌ని ఆయ‌న చెప్పాడు. సమంతకు, త‌నకు మధ్య ఉన్న అనుబంధం గురించి నాగ‌ చైతన్యకు పూర్తిగా తెలుస‌ని తెలిపాడు. అయిన‌ప్ప‌టికీ, త‌న‌కు, సమంతకు ఎఫైర్ ఉందని జ‌రుగుతోన్న ప్ర‌చారం గురించి నాగచైతన్య స్పందించకపోవడం చాలా బాధ కలిగిస్తోందని ఆయ‌న తెలిపాడు. నాగ‌చైత‌న్య ఓ ప్ర‌క‌ట‌న చేస్తే ఈ పరిస్థితిలో చాలా మార్పు వస్తుందని ఆయ‌న చెప్పాడు. సమంత బాధలో ఉందని, ఆమెకు ఇలాంటి సమయంలో మద్దతుగా ఉంటాన‌ని తెలిపాడు.