Vaccination: రండి బాబు, రండి.. టీకా వేసుకోండి.. స్మార్ట్‌ఫోన్ గెలుచుకోండి!: అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పిలుపు

  • మురికి వాడల్లో నత్తనడకన వ్యాక్సినేషన్
  • ప్రతి ఒక్కరికీ వంట నూనె ప్యాకెట్ల పంపిణీ
  • లక్కీ డ్రాలో రూ. 10 వేల విలువైన సెల్‌ఫోన్
  • టీకా కోసం పోటెత్తుతున్న జనం
Ahmedabad Officials announce mobile phone and oil packets for vaccination

కరోనా టీకా వేసుకునేందుకు జనం ఇంకా అలసత్వం ప్రదర్శిస్తుండడంతో గుజరాత్‌లోని అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) అధికారులు వినూత్నంగా ఆలోచించారు. టీకా వేసుకోండి.. స్మార్ట్ ఫోన్ గెలుచుకోండి అంటూ వినూత్న ప్రచారం ప్రారంభించారు. ఏఎంసీ పరిధిలోని కొన్ని ప్రాంతాలు వ్యాక్సినేషన్‌లో వెనుకబడి ఉండడంతో అధికారులు ఈ ప్రోత్సాహకాలు ప్రకటించారు.

మరీ ముఖ్యంగా ఇక్కడి మురికివాడల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. దీంతో లక్ష్యాన్ని సాధించేందుకు నడుంబిగించిన అధికారులు టీకా వేయించుకున్న వారికి వంటనూనె ప్యాకెట్లు అందిస్తున్నారు. అలాగే టీకా వేసుకున్న వెంటనే ఓ కూపన్ అందిస్తున్నారు. ఈ కూపన్లకు డ్రా తీసి గెలుపుపొందిన వారికి రూ. 10 వేల విలువైన ఫోన్లు అందిస్తున్నారు. ఒక్క శనివారమే 10 వేల వంటనూనె ప్యాకెట్లు పంపిణీ చేశారు.

ఈ విషయం తెలియడంతో ఆదివారం టీకా వేయించుకునేందుకు జనం పోటెత్తారు. నిన్న ఏకంగా 20 వేల నూనె ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తీసిన లక్కీ డ్రాలో ఇప్పటి వరకు 25 మంది సెల్‌ఫోన్లు గెలుచుకున్నారు. ఈ మొత్తం కార్యక్రమంలో యువ అన్‌స్టాపబుల్ ఆర్గనైజేషన్ సహకరిస్తోందని ఏఎంసీ అధికారి ఒకరు తెలిపారు.

More Telugu News