చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ లను కలిపి ఏకిపారేసిన కొడాలి నాని

10-10-2021 Sun 15:47
  • మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని
  • చంద్రబాబు నీచుడు అంటూ విమర్శలు
  • లోకేశ్ డ్రగ్స్ వాడుతున్నట్టు నాని సందేహం 
  • పవన్ ఓ గంగిరెద్దు అని వెల్లడి
Kodali Nani comments on opposition leaders

ఏపీ మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్సీ నారా లోకేశ్, జనసేనాని పవన్ కల్యాణ్ లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకునే నీచుడు చంద్రబాబు అని ఎన్టీఆర్ కూడా సర్టిఫికెట్ ఇచ్చారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ వంటి నీచమైన వ్యాపారాలతో లింకులు ఉండేది చంద్రబాబుకేనని అన్నారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ, పురపాలక, నగరపాలక ఎన్నికల్లో అన్ని చోట్లా బాబును ప్రజలు ఓడించారని తెలిపారు. అందుకే ఇప్పుడు బద్వేలు ఉప ఎన్నిక నుంచి బాబు పారిపోయాడని హేళన చేశారు. సీఎం జగన్ కు అపూర్వ ప్రజాదరణ లభిస్తుండడంతో, తన మనుషులతో విషం కక్కిస్తున్నాడని కొడాలి నాని మండిపడ్డారు.

ఇటీవల లోకేశ్ లో వచ్చిన మార్పులు డ్రగ్స్ తీసుకోవడం వల్లనే అని అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు. గత మూడు నెలల నుంచి లోకేశ్ ఎందుకు బయటికి రావడంలేదని నాని ప్రశ్నించారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేశ్ పై బాబుకు నమ్మకం పోయిందని, సొంత కొడుకు పార్టీని నడిపిస్తాడన్న భరోసా లేకపోవడంతో దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ వైపు చూస్తున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు చేతిలో పవన్ కల్యాణ్ ఓ గంగిరెద్దు లాంటి వాడని విమర్శించారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా బడుగు వర్గాలకు అండగా ఉంటుందని, కానీ పవన్ మాత్రం కమ్మ వర్గానికే అండగా ఉంటున్నాడని వ్యాఖ్యానించారు.